ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు వెళ్లని కేసీఆర్, యశ్వంత్ సిన్హాకు ఆహ్వానం
హైదరాబాద్లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్న నేపథ్యంలో నగరంలో బీజేపీ. టిఆర్ఎస్ వర్గాల మధ్య ఫ్లెక్సిల వార్ మొదలైంది. ఒకరిపై ఒకరు భారీ ఎత్తున దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కేసిఆర్ ప్రభుత్వం మీద తెలంగాణ బిజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటెల రాజేందర్ తదితరులు దూకుడుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే తరుణంలో ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇతర మంత్రులు సైతం బీజేపీ పై మాటల దాడి పెంచుతున్నారు. ఏమైందో ఏమోగానీ కేసీఆర్ అయితే ఏకంగా బీజేపీ బలపర్చిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా బలవర్చకుండా వివక్షాలు ప్రతిపాది స్తున్న అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా నిలిచారు. ఆయన గెలవరని తెలిసినప్పటి కీ మోదీపై వ్యతిరేకతతో ఆ వర్గానికి మద్దతుగా నిలిచారు కేసీఆర్. ఇంకా కేటిఆర్ అ యితే ఒకడుగు ముందుకు వేసి తెలంగాణ నుంచి మేం కేంద్రానికి కట్టిన పన్నులు ఎంత? మళ్లీ కేంద్రం నుంచి మాకు వాటాగా వచ్చింది ఎంత? మేమే ఎక్కువ ఇచ్చాం… మాకు ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి అదనంగా రాలేదంటూ ఎత్తిపొడుపుగా అన్నారు.
ఏదైతేనేం బీజేపీ, తెరాస మధ్య నిప్పూ ఉప్పులా ఉన్న ఈ తరుణంలో జులై 3న మోదీ హైదరాబాద్లో సికిందరాబాద్ పెరేడ్ మైదానంలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. దీనికి సంబంధించి బీజేపీ వాళ్లు ‘చాలు దొరా.. చంపకు దొరా’అంటూ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టారు. ఇంకా డిజిటల్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ బోర్డుకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా ఏర్పాటు చేశారు అంటూ కార్పొరేషన్ బీజేపికి రూ.55వేలు జరిమానా కూడా విధించడం గమనార్హం. ఇదే తరుణంలో ఇటు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ కూడా మొదీకి వ్యతిరే కంగా భారీగానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో ‘సాలు మోదీ.. సంపకు మోదీ’ అని రాస్తూ బిజేపీ సర్కారు వైఫల్యాలను వరుసగా పేర్కొన్నారు.
స్విస్ బ్యాంకుల్లోని నల్ల ధనం తెచ్చి ప్రజలకు పంచుతానన్న మోదీ హామీ దగ్గర్నుంచి, నోట్ల రద్దు, రైతుల చట్టాలు , అగ్నిపథ్ నియామకాలు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు ఇవన్నీ పేర్కొంటూ బైబై మోదీ అన్న హ్యాష్ ట్యాగ్ తో పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. సరిగ్గా మోదీ ప్రసంగి౦చే సభకు ఎదురుగానే వీటిని ఏర్పాటు చేయడంతో ఇటు బీజేపీ నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మోదీ పర్యటనకు ఈ వార్ ఇంకెంత వేడెక్కనున్నదో, ఇంకా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అని ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. తెలంగా ణలో బీజేపీని పటిష్టం చేసే క్రమంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జులై 3 న హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. దీనికి పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షుడు పార్టీ ప్రధాన ఆ కార్యదర్శులు, కీలక బాధ్యతల్లో ఉన్నవారు సైతం హాజరుకానున్నారు. తమను టార్గెట్ చేస్తూ తమ ఊళ్లోనే మీటింగ్ పెడతారా అంటూ ఆగ్రహించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇది చివరకు ఒకరిమీద ఒకరు ఫ్లెక్సీలు వేసుకునేవరకూ వచ్చింది.
మూడోసారి ప్రోటోకాల్ ఉల్లంఘన
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ బీజేపీల మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా నిర్వహించాలని నిర్ణయించింది. నేడు, రేపు జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేడు హైదరాబాదులోని బేగంపేట ఎయిర్ పోర్ట్ కు రానున్నారు. ఈ క్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ స్వాగతం పడాల్సి ఉంటుంది. అయితే ప్రోటోకాల్ ను సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ఉల్లంఘించారు. మోడీకి స్వాగతం పలకటానికి ఆసక్తి చూపించని తెలంగాణా సీఎం కెసీఆర్ మోడీకి ఊహించని షాక్ ఇచ్చారు. యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకటానికి ఎయిర్పోర్ట్ కు వెళ్ళారు.
కెసిఆర్ కు బదులుగా, పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ డెవలప్‌మెంట్ మరియు సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ గత రెండు పర్యటనల సందర్భంగా కూడా టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న క్రమంలో గతంలో రెండుసార్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పటికీ కెసిఆర్ ఆయనను స్వాగతించలేదు. అప్పుడు కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నే పంపించారు.
గతంలో ఫిబ్రవరిలో సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చారు. అప్పుడు కూడా కెసిఆర్ మోడీ ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళలేదు. ఆ తర్వాత మే నెలలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఆ సమయంలో కూడా కెసిఆర్ మోడీ రాకను పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకకుండా కెసిఆర్ బీజేపీ ప్రభుత్వం పై తన వ్యతిరేకతను తెలియజేశారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో 4 లోక్‌సభ స్థానాలు, 48 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డులు, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కీలకంగా ఎదగాలని ప్రయత్నిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కెసిఆర్ బిజెపిని టార్గెట్ చేస్తున్నారు. ఏదిఏమైనా ప్రధాని మోడీ విషయంలో ప్రోటోకాల్ పాటించని కేసీఆర్ పై బీజేపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.