హైదరాబాద్ లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీల కలకలం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై2న హైదరాబాద్ వస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మోడీ వస్తున్నారు. జూలై 2,3 తేదీల్లో మాదాపూర్ లో హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల సందర్భంగా రెండు రోజులు హైదరాబాద్ లోనే ఉండనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తున్న సమయంలో నగరంలో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. బీజేపీ జాతీయ సమావేశాల్లో భాగంగా జూలై3న సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దాదాపు 10 లక్షల మందిని సమీకిరంచడానికి తెలంగాణ కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ చుట్టే దర్శనమిస్తున్నాయి. సాలు మోడీ సంపకు మోడీ అని దానిపై రాసి ఉంది. రాత్రికి రాత్రే ఈ ఫ్లెక్సీలు పెట్టారని తెలుస్తోంది. ఎవరు వేశారో తెలియకుండా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టడం తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణలో కొన్ని రోజులుగా అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్దం సాగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య సోషల్ వార్ కూడా ఓ రేంజ్ లో నడుస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కావడంతో వార్ మరింత ముదిరింది. బీజేపీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డు వివాదం కాక రాజేస్తోంది. సీఎం కేసీఆర్ పతనం మొదలైందంటూ “సాలు దొర.. సెలవు దొర” పేరుతో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశారు. అదే పేరుతో వెబ్ సైట్ కూడా ప్రారంభించారు. డిజిటల్ బోర్డు ఏర్పాటుపై గులాబీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా తాము కూడా బోర్డులు పెడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దగ్గర ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టడం చర్చగా మారింది. ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది ఎవరో ఇంకా తెలియనప్పటికి.. ఇదే టీఆర్ఎస్ నేతల పనేనని తెలంగాణ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం నగరమంతా బీజేపీ కటౌట్లు, భారీ హోర్డింగులు, బ్యానర్లు కడుతోంది. అదే సమయంలో బీజేపీకి ధీటుగా హైదరాబాద్ ను గులాబీమయం చేస్తోంది టీఆర్ఎస్. హైదరాబాద్ లోని మూడు మార్గాల్లో ఉన్న మెట్రో పిల్లర్లను తెలంగాణ సర్కార్ బుక్ చేసుకుంది. వాటిపై ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బోర్డులు పెట్టేసింది. మెట్రో పిల్లర్లే కాదు బస్ షెల్టర్లను ప్రకటనలతో ముంచేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం.
హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయం ముందు డిజిటల్ రూపంలో భాజపా హోర్డింగ్‌ను ఏర్పాటు చేసింది. తెరాస పార్టీని ఉద్దేశించి ‘సాలు దొర.. సెలవు దొర’ అని అందులో పేర్కొంది. మరోపక్క టివోలి థియేటర్ సర్కిల్‌లో పేరు ప్రకటించని వ్యక్తులు ‘సాలు మోదీ-సంపకు మోదీ’ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పెద్ద నోట్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, రైతు చట్టాలు, అగ్నిపథ్ వంటి అంశాలపై ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కంటోన్మెంట్ సిబ్బంది వచ్చి.. మోదీ పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో ఫ్లెక్సీ వార్కు దారితీసింది.జీహెచ్ఎంసీ జరిమానా..: ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో భారీగా వెలిసిన ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లపై ట్విట్టర్లో జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా వెలసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లపై ఒక పక్క ఫిర్యాదులు స్వీకరిస్తూనే.. ఈవీడీఎం విభాగం జరిమానాలు విధిస్తోంది. భాజపా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలకు జరిమానా విధించారు.
భాజపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై చలాన్లు వేయడాన్ని ఖండిస్తున్నట్లు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. కేటీఆర్, కేసీఆర్ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రం జీహెచ్ఎంసీ అధికారులు సెలవులో ఉంటారని విమర్శించారు. రాష్ట్రంలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నందున ఇప్పటికే పలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని.. మరికొన్ని పెట్టాల్సి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. తెరాస నేతలు తమ పార్టీకి ఫ్లెక్సీలు పెట్టుకునేందుకు చోటులేకుండా చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. దీనిని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. తెరాస ఏర్పాటు చేసిన బ్యానర్లను తీసివేస్తే బాగుంటుందని.. తామే ఆ బ్యానర్లను చించివేసే వరకు చూడొద్దని హెచ్చరించారు.