తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో కెల్లా అత్యంత ధనిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం.. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుమల వైభోగం రహస్యాలు ఇప్పటికి సాధారణ జనానికి అంతు చిక్కని వైనం.. మనకు తెలియని, అంతుచిక్కని నిగూడ రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వరునికి తల భాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని, శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని, శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందనే ఎన్నో ఆసక్తికర విషయాలు తిరుమల వెళ్లే భక్తుల్లో చాలా మందికి తెలియదు. ఇలా తిరుమల గురించి చాలా మంది భక్తులకు, పర్యాటకులకు తెలియని మరెన్నో ఆసక్తికర విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరికీ తెలియని రహస్య గ్రామం
తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికల ఆకులు, తదితర ఎన్నో పదార్ధాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవ్వరికీ తెలియకపోవడం విశేషం. ఇక్కడి ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు. గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు.
శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు
తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడి వైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది.
శ్రీవారికి నిజమైన జుట్టు
వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కధ కూడా ఉంది. వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు. ఇది గమనించిన నీల దేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది. భక్తి సమర్పించిన తన తల నీలాలను స్వీకరించాలని కోరుతుంది. ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికలు తీరక ముందు, తీరిన తరువాత స్వామి వారికి తలనీలాలను సమర్పించడం ఆనవాయితీగా మారింది.
విగ్రహం వెనుక సముద్ర ఘోష
శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. స్వామి వారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు.
కొండెక్కని దీపాలు
గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి. ఈ దీపాలను ఎప్పుడు, ఎవరు వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియవు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామి వారి ఎదుట కనిపిస్తాయి.
నిజంగా దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు
చాలా కాలం క్రితం 19వ శతాబ్ధంలో దారుణమైన నేరాలకు పాల్పడిన 12 మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణ శిక్ష విధిస్తాడు. వారిని చనిపోయే వరకూ ఉరి తీయాలని ఆదేశిస్తాడు. మరణానంతరం నేరగాళ్ల మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపై వేలాడదీస్తారు. అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామి వారు నిజ రూపంలో కనిపించినట్లు చెబుతారు.
విగ్రహ రహస్యం
శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. పూజారులు ఎన్ని సార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం.
గర్భగుడిలో పూజించిన పూలు వెర్పేడులో ప్రత్యక్షం
తిరుమల వేంకటేశ్వరున్ని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు. వాటిని పూజారులు గర్భగుడిలో స్వామి వారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (శ్రీ కాళహస్తికి వెళ్లే దారి) లో కనిపిస్తాయి.
రసాయనాలకు చెక్కు చెదరని విగ్రహం
ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చ కర్పూరం రాస్తున్నా ఏ మాత్రం చెక్కుచెదరక పోవడం ఆశ్చర్యకరం. దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు.
శ్రీవారికి చెమటలు
తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడినదే అయినా ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం. స్వామి వారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఫారిన్ హీట్ తో వేడిగా ఉంటుంది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. కానీ స్వామి వారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది. అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు. పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు.