ఆంధ్రలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. నిన్నటి వరకు తగ్గినట్టే కనిపించిన మహమ్మారి విరుచుకుపడుతోంది. భారీగా కేసులు పెరుగుతున్నాయి. అదేస్థాయిలో పాజిటివిటీ రేటు కూడా పైపైకి ఎగబాకుతోంది. 23వ తేదీన కాకినాడ జీజీహెచ్‌లో ఐదు కేసులు నమోదు, ఈ రోజు కాకినాడ ఎస్‌కేఆర్ ఉన్నత పాఠశాలలో 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఫోర్త్ వేవ్ రూపంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతుందా..? విలయ తాండవం చేయనుందా..? అంటే ఏదైనా సాధ్యమేనని వైద్యులు చెప్తున్నారు. మొదటి మూడు వేవ్‌లతో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ పలు విధాలుగా రూపాంతరం చెంది భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిం దే. థర్డ్‌వేవ్ తర్వాత కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో ప్రాణనష్టం తగ్గి ఇప్పుడిప్పుడే ప్రశాం తమైన వాతావరణం నెలకొంటోంది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తుంటే కాకినాడ జీజీహెచ్‌లో ఐదు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవ్వడం భయాందోళన కలిగిస్తోంది. కొవిడ్ బాధితులకు జీజీహెచ్‌లో చికిత్స జీజీహెచ్‌లోని ప్రత్యేక కొవిడ్‌వార్డులో ఇద్దరు, గైనిక్‌వార్డులో ఇద్దరు, నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో ఒక చంటిబిడ్డ కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం జీజీహెచ్ వైరాలజీ విభాగంలో రోజుకు 200 వరకు నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2020 ప్రారంభంలో చైనా దేశంలోని వూహాన్ నుంచి ఇండియాకు వచ్చిన విద్యార్థులకు కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. అనంతనం కేసులు పెరిగిపోవడంతో జీజీహెచ్ మొత్తం ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రిగా రూపాంతం చెందింది. కొవిడ్ సెకండ్‌వేవ్‌లో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులు ప్రతిరోజు 60మంది వరకు మృత్యువాత పడ్డారు. దీంతో బాధిత కుటుంబాలు భిన్నాభిన్నమై రోడ్డునపడ్డాయి. ప్రస్తుతం వైరస్ అంత శక్తివంతం కాదని, పెద్దగా ప్రభావం ఉండబోదని, అయినా మాస్క్, శానిటైజర్ వాడకం శ్రేయస్కరమని వైద్యవర్గాలు సూచిస్తున్నాయి. ఆంధ్రలో వారం రోజుల నుంచి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అందుకే అధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడలో ఎక్కువ కేసులు వస్తున్న వేళ… వైద్యశాఖ కీలక సూచనలు చేసింది. మాస్కులు ధరించడం.. ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజేషన్ రూల్స్ కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారిగా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎస్‌కేఆర్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం విద్యార్థులకు ఈ నెల 18 నుంచి ప్రారంభమైన ఎన్‌సీసీ క్యాంప్… ఎన్‌సీసీ క్యాంప్‌లో మొత్తం 317 మంది విద్యార్థులు ఉన్నారు.. ఇందులో 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం … దీంతో లక్షణాలున్న విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచిన అధికారులు, 40 మంది విద్యార్థులు రిజల్ట్స్ వచ్చాక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి క్యాంపు కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. థర్డ్ వేవ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.. కరోనా కట్టడికి ప్రత్యేకంగా చర్యలు, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కోరుతున్నారు. ఇరవై నాలుగు గంటల్లో దేశంలో 1,985 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్ లో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 11,542గా ఉంది. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 186.54 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.
ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం, చుట్టు పక్కన ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ప్రతీ రోజూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఢిల్లీలో ఆంక్షల ప్రభావం మొదలైంది. మాస్కులు తప్పనిసరి చేసిన ఆప్ సర్కార్.. వాటిని ధరించకపోతే రూ.500 ఫైన్ విధిస్తోంది. దీంతో పాటు ఢిల్లీ పాఠశాలలు తెరించి ఉందాలా వద్దా అనే అంశంలో ఢిల్లీప్రభుత్వం ఇరుకునపడుతోంది. ప్రస్తుతానికి మాత్రం మాస్కులు ధరించి రావాలని విద్యార్ధులను కోరుతోంది. విద్యాసంస్ధల మూసివేత విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది