అమెరికాలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం జూన్ 18 నుంచి జూలై 9వ తేదీ వరకు ఎనిమిది నగరాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు.
తిరుమలలో శనివారం ఆయన ఈవో శ్రీ ధర్మారెడ్డి తో కలసి మీడియాతో మాట్లాడారు. గత రెండున్నరేళ్లుగా కరోనా వల్ల ఇతర దేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు అమెరికాలోని భక్తుల కోసం టీటీడీ శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాసభారతీయుల అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామన్నారు.
జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో నగరాల్లో స్వామివారి కల్యాణాలు నిర్వహిస్తామని ఛైర్మన్ చెప్పారు. అలాగే జూలై 2న న్యూ ఆర్లిన్,
3న వాషింగ్టన్ డిసి, 9వ తేదీ అట్లాంటా నగరాల్లో శ్రీవారి కళ్యాణాలు జరుగుతాయన్నారు. ఇతర దేశాల నుంచి కూడా తమ ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని విజ్ఞప్తులు వచ్చాయని వాటిని కూడా పరిశీలిస్తామని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రపంచం వ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
కళ్యాణోత్సవ కార్యక్రమాలకు భక్తులను ఉచితంగా అనుమతిస్తాం అనీ, భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని భావిస్తున్నామన్నారు. కళ్యాణోత్సవ కార్యక్రమాలకు విగ్రహాలను తిరుమల నుంచి తీసుకువెళ్లి..తిరుమల తరహలోనే కళ్యాణోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. త్వరలోనే యూకే,దుబాయ్ వంటి దేశాలలో కూడా కళ్యాణోత్సవ కార్యక్రమాలను నిర్వహించేందుకు యోచిస్తున్నామన్నారు. ఇటీవల ఢిల్లీలో టీటీడీ కళ్యాణోత్సవాలు నిర్వహించగా, రాజకీయ ప్రముఖులతో పాటు ఆధ్యాత్మిక వేత్తలు, సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
టీడీ ఉద్యోగులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. వేసవి రద్దీ తగ్గిన తరువాత సర్వదర్శన భక్తులకు టోకెన్లు జారీచేస్తామన్నారు. రేపటి నుంచి శ్రీవారి వార్షిక జ్యేష్టాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. రేపు వజ్రకవచం ధరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. ఎల్లుండి ముత్యపు కవచంలో, చివరి రోజున స్వర్ణ కవచంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. ఇవాళ తిరుమలలో కరెంట్ బుకింగ్ విధానంలో జ్యేష్టాభిషేకం టిక్కెట్లు విడుదల చెయ్యనుందన్నారు.