గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలం వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద్రేద్ర స్వామి, స్వాత్వానంద్రేద్ర స్వామి పాల్గొన్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ణ, మహాసంప్రోక్షణ అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, స్వరూపానంద్రేద్ర స్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు తదితరులు మొదటి దర్శనం చేసుకున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో రూ.40 కోట్ల వ్యయంతో, 25 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణం జరిగింది. ఈ నెల నుంచి కొనసాగుతున్న మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ణ, మహాసంప్రోక్షణను టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నేటి సాయంత్రం నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. తిరుమల తర్వాత టీటీడీ వెంకటపాలెంలోనే అతి పెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం గమనార్హం.
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి
గుంటూరు జిల్లా వెంకటపాలెంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మిథున లగ్నంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ జరిగింది. ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరించందన్, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆవిష్కరించారు..అంతకుముందు పుణ్యాహవచనం, కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. విమాన గోపుర కలశ ఆవాహన చేశారు.అనంతరం ఆగమోక్తంగా ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ, బ్రహ్మఘోష, వేదశాత్తుమొర నిర్వహించారు. ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీనివాస కల్యాణం, సాయంత్రం ఉత్సవమూర్తుల ఊరేగింపు, ధ్వజావరోహణం, నిత్య కైంకర్యాలు, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ నిర్వహించనున్నారు.
అతిధులకు సన్మానం
శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ అనంతరం ఆలయ ముఖమండపంలో గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి శాలువతో సన్మానించి, స్వామివారి చిత్రపటం అందించారు. అనంతరం గవర్నర్ కు వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు.
చైర్మన్ దంపతులచే అర్చక బహుమానం
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణ సందర్బంగా వైదిక క్రతువుల్లో పాల్గొన్న అర్చకులు, వేద పారాయణం దారులను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు సన్మానించారు. శాలువతో సత్కరించి పంచలు బహూకరించారు.
శ్రీవారి అనుగ్రహంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి – దేవాదాయ శాఖ మంత్రి
వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కోరిక మేరకు, టీటీడీ చైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అమరావతి ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించినట్లు తెలిపారు. వైఖానస ఆగమానుసారం అద్భుతమైన శిల్ప కళతో శ్రీవారి ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఆలయంలో మూలమూర్తి సాక్షాత్తు తిరుమల వెంకన్న తిరిగి వచ్చాడా అన్నంతగా ఉందన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో నిర్మించిన శ్రీవారి ఆలయం ప్రత్యేకంగా ఉన్నదని చెప్పారు. శ్రీ వారి అనుగ్రహంతో రాష్ట్రం బాగుండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం టీటీడీ ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ అమరావతిలో రెండు సంవత్సరాల క్రితం రూ.31 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇటీవల విశాఖ, ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో శ్రీవారి ఆలయాలు ప్రారంభించినట్లు చెప్పారు. అదే విధంగా ఉత్తర భారతదేశంలోని జమ్మూలో 60 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయ నిర్మాణం జరుగుతోందని, ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో 500 ఆలయాలు పూర్తి చేసినట్లు చెప్పారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, మత్స్యకార, బడుగు బలహీనవర్గాల ప్రాంతాలలో రాబోయే రెండేళ్ళలో 1300 శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు.
తిరుమల నుండి స్వామివారు మనందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారన్నారు. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమల వెళ్లే భక్తులకు అమరావతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించడం ద్వారా ఇక్కడే స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో అమరావతి లో స్వామివారి ఆలయాన్ని నిర్మించిన టీటీడీ ని ఆయన అభినందించారు. శ్రీ వారి అనుగ్రహంతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.