బానిసత్వ సంకెళ్లు వీడి పోరాటమే ధ్యేయంగా నిలబడాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వరదలకు సహాయం లేకపోవడం, సకాలంలో జీతాలకు నిధులు రాకపోవడం, రోడ్లు వేయలేకపోవడం, ప్రత్యేక హోదా సాధించుకోక పోవడం సీఎం వైఫల్యానికి నిదర్శనమన్నారు. జగన్ మోహన్ రెడ్డి నోటి నుంచి కనీసం కేంద్రం నుంచి వచ్చే నిధులు సాధించుకోవాలన్న మాట కూడా రావడంలేదని ఆరోపించారు. జగన్‌ను ఎన్నుకున్నది సీఎం హోదాతో ఆయన ఎంజాయ్ చేయడానికో, సొంత విషయాలు మాట్లాడుకోవడానికి కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి అడక్కుండానే ఎగబడి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నిసార్లు బీజేపీ చేతిలో మోసపోతారని శైలజానాథ్ ప్రశ్నించారు. తమ అసమర్థతకు, భయానికి సామాజిక న్యాయం అనే ట్యాగు చంద్రబాబు, జగన్‌లు వేస్తున్నారని, విమానాశ్రయంలో గేటుకు ఒక వైపు వైసీపీ నేతలు, మరో వైపు టీడీపీ నేతలు పోటీపడి మద్దతు, స్వాగతం పలికారన్నారు. బీజేపీకి ఏ రాష్ట్రంలో లేని సంఖ్యాబలం ఆంధ్రప్రదేశ్‌లో ఉందన్నారు. 175 మంది శాసన సభ్యులు, 25 మంది లోక్ సభ, 11 మంది రాజ్యసభ సభ్యుల బలం ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, వెనకబడిన జిల్లాల నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీని డిమాండ్ చేయాలన్నారు. రాష్ట్రపతి విజయం కావాలంటే వైసీపీ మద్దతు అవసరమన్నారు. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఎస్సీ, లేదా ఎస్టీని చేయాలని సీఎం జగన్‌కు శైలజానాథ్ సూచించారు.