13 మండలాల్లో 198 రైతు భరోసా కేంద్రాల పరిధిలో సేకరించిన ధాన్యానికి 5,500 మంది రైతులకు రూ.120 కోట్లను వారి ఖాతాల్లో జమచేసిన ప్రభుత్వం తూర్పు గొదావరి, కోనసీమ జిల్లాల రైతులు పంట విరామం ప్రకటించడంతో అధికార యంత్రాంగం మేల్కొంది. ఖరీఫ్‌లో పంట వేయబోమంటూ కొందరు రైతులు తీర్మానాలు చేశారు. దీంతో అధికారులు స్పందించారు. 2011లో మాదిరిగా పంటవిరామాన్ని ఉద్ధృతం చేసే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఐ.పోలవరం మండలం రైతులంతా ఖరీఫ్ సీజన్కు పంట విరామం (క్రాప్ హాలీడే) ప్రకటిస్తున్నామని పేర్కొంటూ తహసీల్దార్ వినతిపత్రం అందజేశారు. మండల అధికారుల ద్వారా సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్.. ఇవాళ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐ. పోలవరం మండలం పరిధిలోని గ్రామంలో స్థానిక రైతులు ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం, ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ, పంట కాలువల నిర్వహణ.. వంటి విషయాలను కలెక్టర్కు వివరించారు.
కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, అమలాపురం అర్డీవో వసంతరాయుడు, డ్రెయిన్ల అధికారులతో కలసి అల్లవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల్లో పర్యటించారు. ప్రధాన డ్రెయిన్లు, మురుగు కాలువలు, ప్రధాన పంట కాలువలు, ముంపునీరు సముద్రంలోకి దిగే సముద్ర మొగ ప్రాంతాలను పరిశీలించారు.
పంట విరామం ఆలోచన విరమించుకోవాలి : కలెక్టర్
కోనసీమలో కొన్ని మండలాల్లో రైతులు పంటవిరామం అంటున్నారని, ఆ అలోచన విరమించుకుని సాగు చేపట్టాలని కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. సాగుకు అవసరమైన వసతులన్నీ రైతులకు కల్పిస్తామన్నారు. ప్రభుత్వపరంగా అన్నివిధాలా సాయం చేస్తామని, వారం రోజుల్లో మురుగు కాలువల్లో పూడికతీత పనులు చేయిస్తామని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పంట కాలువలకు సాగు నీరు విడుదల చేసినందున రైతులు ఖరీఫ్ పనులు ఆరంభించాలని కలెక్టర్ కోరారు.
రైతుల ఖాతాల్లోకి ధాన్యం సొమ్ములు..
కోనసీమలోని 13 మండలాల్లో 198 రైతుభరోసా కేంద్రాల పరిధిలో సేకరించిన ధాన్యానికి 5,500 మంది రైతులకు రూ.120 కోట్లను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమచేసినట్లు పౌరసరఫరాల సంస్థ డీఎం ఆర్.తనూజ తెలిపారు. కోనసీమ వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా అధికారులతో కలిసి పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి డబ్బుల విడుదలకు హామీ ఇచ్చి అమరావతి స్థాయిలో ఉన్నతాధికారులతో చర్చించి రూ.120 కోట్ల విడుదలకు కృషిచేశారు. దీంతో కోనసీమలోని ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం, అయినవిల్లి, అంబాజీపేట, పి.గన్నవరం, రాజోలు, మలికిపురం, మామిడికుదురు, సఖినేటిపల్లి మండలాల పరిధిలోని రైతుల నుంచి ఈ నెల 7వ తేదీ వరకు సేకరించిన ధాన్యానికి వారందరి ఖాతాల్లో డబ్బులు జమచేశారు.
కోనసీమలో క్రాప్ హాలిడే బాట పట్టిన రైతుల ప్రశ్నలివి..!
ఖరీఫ్ దృష్ట్యా.. ప్రస్తుతానికి 50 వేల ఎకరాల్లో.. అన్నదాతలు నాగలికి సెలవిచ్చారు..! ఉద్యమం అబద్ధమంటున్న ప్రభుత్వ పెద్దలు వచ్చి…తమ ఆధ్వర్యంలో సాగు చేసి కష్టాలు తెలుసుకోవాలంటూ.. రైతులు ఆహ్వానించారు.
కోనసీమలో 2011లో పురుడు పోసుకున్న క్రాప్ హాలిడే ఉద్యమం….
మళ్లీ తెరపైకి వచ్చింది. లాభం సంగతి పక్కన బెడితే…పెట్టిన పైసా పెట్టుబడీ వెనక్కి రావట్లేదంటూ.. రైతులు తొలకరి పంటకు దూరమవ్వాలని నిర్ణయించారు. పంట వేయడం కన్నా మానుకుంటేనే మేలంటూ…నాగలి వదిలేసి ఇంటికి పరిమితం కావడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే.. అల్లవరం, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, రాజోలు మండలాలకు చెందిన అన్నదాతలు క్రాప్ హాలిడే ప్రకటించారు.రైతు పరిరక్షణ సమితి ప్రతినిధుల ఆధ్వర్యంలో.. రైతులు, కౌలు రైతులు అధికారుల్ని కలిసేందుకు వెళ్లగా.. ఎవరూ లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఖరీఫ్ సాగుకు.. 50 వేల ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించామని.. రైతు నేతలు అంటున్నారు. మున్ముందు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు చేసిన ప్రభుత్వం నెలలు గడిస్తే గానీ డబ్బు చెల్లించడం లేదని.. రైతులు వాపోయారు. విత్తు వేసినా కూలి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రుణం ఇప్పిస్తామన్నా.. అసలు మొత్తం పక్కనబెడితే వడ్డీ చెల్లించలేమంటున్నారు.క్రాప్ హాలిడేపై అంటున్న రైతు మాట అబద్ధమని ప్రభుత్వ పెద్దలకు అనుమానం ఉంటే.. వారే వచ్చి తమ ఆధ్వర్యంలో సాగు చేయాలని సూచించారు. ఆ తర్వాతే వారికి రైతు కష్టాలపై స్పష్టత వస్తుందన్నారు. క్రాప్ హాలిడే ఉద్యమానికి..ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని తేల్చిచెప్పారు.
పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు
ఖరీఫ్‌లో వరి సాగుకు ఎకరాకు సగటున రూ.40వేల వరకు ఖర్చవుతోంది. కౌలు రూపంలో ఎకరాకు రెండు పంటలకు కలిపి 22-28 బస్తాలు ఇస్తున్నారు. తొలి పంట సక్రమంగా చేతికొచ్చినా.. ఎకరాకు రూ.15వేల వరకు నష్టపోతున్నారు. గతంతో పోలిస్తే డీజిల్ ధరలు 40%, ఎరువుల ధరలు 60% పెరిగాయి. దమ్ము చేయడం, ధాన్యం రవాణా, కోత యంత్రాల వినియోగం వంటివన్నీ పెనుభారంగా మారాయి.
కూలీల సమస్య
వరి సాగు సమయంలో ఉపాధిహామీ పనుల కారణంగా.. కూలీలు దొరకట్లేదు. సమయానికి నాట్లు పడక, కోతలు కోయలేకపోవడంతో.. దిగుబడిపై ప్రభావం పడుతోంది
అప్పుల కొలిమిలో కౌలు రైతులు
సాగు చేసేవారిలో 90% కౌలురైతులే ఉంటున్నారు. ఖరీఫ్‌లో ఎకరాకు 25 బస్తాల దిగుబడి వస్తే.. అందులో 15 బస్తాలు యజమానికి ఇవ్వాలి. మిగిలిన 10 బస్తాలకు వచ్చేది రూ.12వేలే. పెట్టుబడి రూ.35-40వేల మధ్యన ఉంటుంది. అంటే రూ.20వేలకు పైనే నష్టం వస్తోంది. వర్షాలు కురిస్తే గింజ కూడా దక్కదు. ఈ సమయంలో భూయజమానులు కౌలు రద్దుచేసినా.. అప్పులు తప్పట్లేదు. రబీలో ఆశించిన దిగుబడులు రావడం లేదు.