దివంగత అహ్మద్ పటేల్‌పై చేసిన దుశ్చర్య ఆరోపణలను శైలజనాధ్ ముక్తకంఠంతో ఖండించారు. ఈ ఆరోపణలు 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన మత మారణహోమానికి బాధ్యత వహించకుండా మోడీ తప్పించుకోవలనే వ్యూహంలో భాగమని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోడీ కేవలం రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా తన రాజకీయ ప్రత్యర్థులుగా మారిన వారిని, వ్యతిరేకంగా మాట్లాడేవారిని విడిచిపెట్టడం లేదని అన్నారు. అయినా మరణించిన వ్యక్తిని దూషించే విధంగా మోడీ వ్యాఖ్యలు తగవని పేర్కొన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో రైతులను ఆదుకోవాలి
రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి స్వయంగా పర్యటించి బాధితులను ఆదుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. పంటలు నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికపై కదిలేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్జప్తి చేశారు. గత నాలుగు రోజులుగా భారీ వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నా కేంద్రం నుండి కనీస స్పందన లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన గోదావరి తీర్రపాంత ప్రజలను ఆదుకోవడానికి తక్షణమే సహాయచర్యలు చేపట్టాలని శైలజనాథ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన శనివారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. గోదావరి వరదకు కోనసీమ లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయని, భారీ వరదల కారణంగా వందలాది లంక గ్రామాలు వరదనీటిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రపురంలోని కోటిపల్లి గ్రామంలో వరద ఉధృతి అత్యంత భయానకంగా ఉందని, మూడు రోజులుగా తినడానికి తిండి లేక పస్తులు ఉంటున్నామని బాధితులు రోదిస్తున్నారని, ఇళ్ళన్నీ సగానికి పైగా మునిగి పోవడంతో అనేకమంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని పేర్కొన్నారు. ముమ్మిడివరం వద్ద గోదావరి అత్యంత ఉగ్రరూపం దాల్చిందని, అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద కుడి కాలువలోకి వరదనీరు ఎగజిమ్ముతోందని, గండి పడితే ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాలలో అపార నష్టం సంభవించే అవకాశం ఉందన్నారు. ముంపు గ్రామ పంచాయతీలకు తగిన నిధులు కేటాయించాలని, సచివాలయ సిబ్బంది వలంటీర్లు, పంచాయతీలు సమన్వయం చేసుకొని అన్నిపక్షాల సహకారంతో సహాయ కార్యక్రమాలు చేపట్టాలని, వరద పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని శైలజనాథ్ కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన వరద బాధిత ప్రజలకు సహాయక చర్యలు అందించాలన్నారు. రెస్క్యూ టీమ్‌లు బోట్లు పెట్టి వరద బాధిత మండలాలలో అన్ని గ్రామాల నుండి ప్రజలను తరలించి పునరావాస కేంద్రాలకు చేర్చి అక్కడ అన్ని రకాల సౌకర్యాలూ కల్పించాలని కోరారు.