తిరుమల తిరుపతి దేవస్థానం అమలుచేస్తున్నశ్రీవాణి ట్రస్టు పేరిట నిలువ దోపిడీ జరుగుతోందని, శ్రీవాణి ట్రస్టుకి ఆడిటింగ్ ఉందా ? అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. శ్రీవారిని మాజీమంత్రి అయ్యనపాత్రుడు దర్శించుకున్నారు. దుర్మార్గ, రాక్షస పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని శ్రీవారిని ప్రార్ధించానన్నారు.
తిరుమలలోని ఏర్పాట్లపై భక్తులను ఆరా తీశారు. నీటికి కూడా ఇబ్బందులు పడుతున్నామని భక్తులు చెబుతున్నారు. స్వామీజీలు ధర్మప్రచారాన్ని మరచి రాజకీయ భజన చేస్తున్నారని ఆరోపించారు. పీఠాధిపతులు రాజకీయాలను వదిలి ధర్మ ప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చెయ్యాలన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్నారు. మహానాడు జరిగిన తీరు చూస్తే జగన్ గుండె ఆగుతుందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10 వేలు విరాళం ఇస్తే వీఐపీ దర్శనం
తిరుమల శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ (శ్రీవాణి) ట్రస్టుకు విరాళాలందించే వారి కోసం నవంబరు 4న ఆన్‌లైన్ అప్లికేషన్ టీటీడీ ప్రారంభించింది.ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు చేరుకుని బ్రేక్ దర్శనానికి వెళ్లొచ్చన్నారు. ఆన్‌లైన్‌లో లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం ఉందని ఆలయాధికారులు తెలిపారు.
సనాతన ధర్మప్రచారంలో భాగంగా మారుమూల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు టీటీడీ ఈ ట్రస్టును ప్రారంభించింది. శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళమిచ్చే దాతలకు ఒక బ్రేక్ దర్శన టికెట్ ప్రివిలేజ్‌గా అందజేస్తారు. అయితే, రూ.500 చెల్లించి బ్రేక్ దర్శన టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. శ్రీవాణి ట్రస్టుకు దాతలు ఒక రూపాయి నుంచి ఎంతమొత్తమైనా విరాళంగా అందజేయవచ్చని, రూ.10 వేలకు మించితే టీటీడీ కల్పించే ప్రయోజనాలు అందుతాయి. రూ.10 వేలకు ఒక బ్రేక్ దర్శన టికెట్ చొప్పున 99 వేల వరకు 9 టికెట్లను దాతలు పొందే అవకాశముందన్నారు. ఒక లక్ష, ఆపైన విరాళాలు ఇచ్చే దాతలకు టీటీడీ ఇదివరకే పలు ట్రస్టులు, స్కీమ్‌లకు అందిస్తున్న తరహాలోనే ప్రయోజనాలను వర్తింపజేశారు.