ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం చూస్తే ఎన్నికల సీన్ ను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ సైతం యాక్టివ్ అవుతోంది. ఇప్పటికే కౌలురైతుల భరోసా యాత్ర పేరిట పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తాజాగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు జూన్ 1 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు జూన్ 1వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. జూన్ 1న శ్రీకాకుళం జిల్లా, జూన్ 2న విజయనగరం జిల్లా, జూన్ 3న విశాఖపట్నం జిల్లాలోని పలు నియజకవర్గాల్లో నాగబాబు పర్యటిస్తారు. ఈ పర్యటనలో మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ ముఖ్య నాయకులకు, జిల్లా కమిటీ నాయకులకు, నియోజకవర్గ కమిటీ నాయకులకు, ఆయా విభాగాల కమిటీ నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు అందుబాటులో ఉంటారు.
ముఖ్యమైన సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులకు జనసేనాని పవన్ కల్యాణ్ ఆలోచనా విధానం, పార్టీ భవిష్యత్ కార్యకలాపాల గురించి నిర్దేశం చేస్తారు. అదేవిధంగా పార్టీ ఎదుగుదలకు దోహదపడే అభిప్రాయాలు స్వీకరిస్తారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న పలువురు నాయకులను పార్టీలోకి ఆహ్వనించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్న నాగబాబుకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చెస్తున్నారు