రాష్ట్రంలో కొద్ది రోజులుగా భానుడు భగభగమంటున్నాడు. ఓవైపు నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించినప్పటికీ.. ఎండలు మాత్రం తగ్గడం లేదు. 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రానున్న మూడు రోజులు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత పెరగనుందని తెలిపింది. శుక్రవారం 83 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 157 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ డైరెక్టరు బిఆర్ అంబేద్కర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. శుక్రవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్‌టిఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. విశాఖపట్నం, కడప, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. శనివారం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్‌టిఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. పార్వతీపురం మన్యం, విజయనగరం, కోనసీమ, నెల్లూరు, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు.
శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 ఉంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని వివరించారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్‌టిఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతాయని పేర్కొన్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపారు.
ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసుకునే పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు త్రాగాలన్నారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి.
రాబోయే రోజులు ఉష్ణోగ్రతల్లో అసాధారణ మార్పులు ఉంటాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. వడగాలులు తీవ్రం అవుతాయని ఆర్టీజీఎస్ ప్రజలకు సూచనలు చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వృద్ధులు, పిల్లలు ఎండలో బయటకు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
అత్యవసరమైతే టోపీ, టవల్, పండ్ల రసాలు, ఓఆర్‌ఎస్ పౌడర్ తీసుకుంటూ కనీస జాగ్రత్తలు పాటిస్తూ బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. అదే విధంగా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చలివేంద్రాలను విరివిగా ఏర్పాటుచేయాలని పిలుపునిచ్చారు.