ప్రపంచ దేశాలను చిన్నా భిన్నం చేసిన కరోనా సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత్ ఎంతో ధైర్యాన్ని చూపించిందని యావత్ దేశాలు మెచ్చుకున్నాయి.ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ను తన ముందు చూపుతో సమర్ధవంతంగా ఎదర్కుకునేలా ప్రధాని ఆలోచించాయని ప్రశంసించాయి.యావత్ ప్రపంచం కూడా భారత్ వైపు చూసిందని అభిప్రాయాన్ని వెల్లడించాయి.
దేశ ప్రజలు కూడా ఇదే భావనతో వున్నారు. కరోనా తర్వాత ప్రధాని మోదీకి ప్రజాదరణ మరింత గరిష్ఠానికి చేరుకుందని ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన పోల్ లో తెలిసింది. ఒకవైపు నిరుద్యోగం, కమోడిటీ, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయినప్పటికీ, మరోవైపు మోదీ ప్రభుత్వానికి కూడా ప్రజాదరణ సైతం మరింత బలపడినట్టు లోకల్ సర్కిల్స్ సర్వే తెలిపింది.
ఈ సర్వేలో భాగంగా 64,000 మంది అభిప్రాయాలను తెలుసుకుని ఫలితాలను ప్రకటించారు. మోదీ ప్రభుత్వం తమ అంచనాలను అందుకుందని 67 శాతం మంది చెప్పారు. గతేడాది ఇలా చెప్పిన వారు 51 శాతమే ఉన్నారు. 2020లో 62 శాతం మంది ఇదేవిధంగా చెప్పారు. అంటే గత రెండేళ్లతో పోలిస్తే మోదీ ప్రభుత్వానికి ఎక్కువ మంది ప్రజల అంచనాలను అందుకున్నట్టు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
మూడో వేవ్ ను ప్రభుత్వం మెరుగ్గా ఎదుర్కొన్నదని.. ఆర్థిక వ్యవస్థను ప్రభావవంతంగా కొనసాగించినట్టు సర్వేలో పాల్గొన్నవారు చెప్పారు. అయితే, నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదని అభిప్రాయపడ్డారు. కాకపోతే 37 శాతం మంది మోదీ సర్కారు నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తుందని నమ్ముతున్నారు. 73 శాతం మంది నిత్యావసరాలు, జీవన వ్యయాలు గత మూడేళ్లలో గరిష్ఠాల్లోనే ఉన్నాయని తెలిపారు. 2024లో మూడో విడత అధికారాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్న మోదీ సర్కారు అధిక ధరలు, నిరుద్యోగంపై దృష్టి సారించాలని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి.
తమ భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు పట్ల ఆశావహంగా ఉన్నట్టు 73 శాతం మంది చెప్పారు. కాలుష్యం నియంత్రణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని 44 శాతం మంది తెలిపారు. 60 శాతం మంది మత సామరస్యాన్ని పెంపొందించడంలో ప్రభుత్వం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు అంగీకరించారు.
మొత్తానికి ఏది ఎమైనా కరోనా ఎంతనష్టం చవిచూపించినా కూడా..వాటిన అదిగమించడంలో ప్రజల మనస్సులను ఆకట్టుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన దైన శైలిలో చాకచక్యంగా వ్యవహరించారనే చెప్పవచ్చు అంటూ సర్వేలో వెల్లడవుతోంది.