తెలుగుదేశం-ఎన్డీఏ మధ్య కొత్త పొత్తు కుదురుతుందా లేక పాత పొత్తు కొనసాగుతుందా అనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొన్న బాబు ఢిల్లీ టూర్ కి వెళ్లినప్పుడు ప్రధాని మోదీతో చంద్రబాబు మాట్లాడారు. కాని, ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా మాట్లాడారని వార్త ఇచ్చింది. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు పై రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయని, ఇప్పటికే చర్చలు కూడా ముగిశాయని జాతీయ మీడియా లో అనేక కథనాలు వస్తున్నాయి. బీజేపీకి టీడీపీ క్రమంగా దగ్గరవుతోందంటూ ఇప్పటికే ఏపీ రాజకీయాల్లోనూ, అటు ఢిల్లీ రాజకీయాల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది.
ఈ ఊహాగానాలకు బలాన్నిస్తూ, ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెళ్తూ వెళ్తూ టీడీపీ రాజగురువు గా చెప్పుకొనే రామోజీరావుతో రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా మాట్లాడారు. అంతేకాదు, జూనియర్ ఎన్టీఆర్‌ను పిలిపించుకుని మరీ మాట్లాడారు. ఇవన్నీ తెలుగుదేశం-ఎన్డీఏ పొత్తు గురించి జరిగినవే నన్న చర్చ జరుగుతోంది. అమిత్‌షాతో రామోజీరావు, ఎన్టీఆర్ మధ్య జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే ప్రధాన చర్చ జరిగిందని తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు సైతం అనుకుంటున్నారు.
తాజాగా ఢిల్లీలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ ఒక పెద్ద ఉపద్రవం వచ్చినప్పుడు రాజకీయ శక్తులన్నీ ఏకం కావాలని, రాష్ట్రంలో అది జరుగుతుందని విశ్వసిస్తున్నానని అన్నారు.ప్రధాని మోదీని టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి మాట్లాడడం మంచి పరిణామం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కలిసినట్లు తెలిసింది. ఈ సంఘటనలు పరిశీ లిస్తే ఎన్డీఏలో తెలుగుదేశం చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే తమ వైఎస్సార్ పార్టీకి నష్టమని ఆయన అన్నారు.