పశ్చిమ గోదావరి : జిల్లాల పునర్విభజన అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర ఆసుపత్రి విషయంలో గందరగోళం నెలకొంది. జిల్లా కేంద్ర ఆసుపత్రి ఎక్కడనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రి ఉంది. ఏలూరుకు వైద్య కళాశాల మంజూరు కావడంతో తణుకు ఏరియా ఆసుపత్రిని జిల్లా కేంద్ర ఆసుపత్రిగా స్థాయి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి స్థలం సేకరించి కొత్తగా భవనాలు నిర్మించాల్సి ఉంది. స్థల సేకరణ ప్రయత్నాలు చేపట్టారు. స్థల సేకరణ జరగకుండానే 2021 సంవత్సరంలో అప్పటి వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నాని స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుతం మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన కూడా చేశారు. కానీ స్థల సేకరణ, ఆస్పత్రి నిర్మాణంపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇంతలో జిల్లాల పునర్విభజనతో నరసాపురం పార్లమెంట్ నియోజకర్గాన్ని భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ జిల్లా కార్యాలయాలన్నీ భీమవరంలో ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి కూడా భీమవరంలోనే ఏర్పాటవుతుందని ప్రచారం సాగినా స్పష్టత లేదు. తణుకులో జిల్లా కేంద్ర ఆస్పత్రి ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగలేదు.
తణుకులోనే జిల్లా కేంద్ర ఆసుపత్రి
జిల్లా కేంద్ర ఆసుపత్రి ఏర్పాటుకు స్థల సేకరణ లేకున్నా, భవనాల నిర్మాణం లేకున్నా ప్రభుత్వ రికార్డులలో తణుక ఏరియా ఆస్పత్రి జిల్లా కేంద్ర ఆస్పత్రిగా ఉంది. ఏరియా ఆస్పత్రి ఆవరణలోనే నూతన భవనం నిర్మాణం పూర్తి కానుండడంతో కొన్ని విభాగాల ఏర్పాటుకు జిల్లా పునర్విభజనకు ముందే నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లోనే అదనపు వైద్య సిబ్బందిని నయమించారు. ఏరియా ఆసుపత్రిగా ఉండగా 12 మంది వైద్యులు ఉన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిగా ప్రకటించిన తర్వాత వైద్యుల సంఖ్య 22కు పెరిగినా నియామకం కాలేదు. నిత్యం 600 మంది రోగులు వైద్య సేవలు పొందుతారు. సుమారు 15 ఆపరేషన్లు జరుగుతున్నాయి. జిల్లా ఆస్పత్రికి తగ్గ సేవలందించాలంటే తగిన వసతులు కల్పించాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టకున్నా రికార్డులలో జిల్లా కేంద్ర ఆస్పత్రిగానే కొనసాగుతుందని వైద్య వర్గాల సమాచారం.
రెండు జిల్లా ఆస్పత్రులు నిర్వహిస్తారా ?
ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తణుకులో జిల్లా కేంద్ర ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ఏలూరులో వైద్య కళాశాల ఏర్పాటుతో తణుకులోనే జిల్లా ఆసుపత్రి ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త వైద్య విభాగాలను ఏర్పాటు చేశారు. భీమవరం కేంద్రంగా కొత్త జిల్లాలో జిల్లా కేంద్ర ఆసుపత్రి కూడా అక్కడే ఏర్పాటు కావచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం తణుకు ఆస్పత్రిలో జిల్లా కేంద్ర ఆస్పత్రి సేవలందిస్తున్నారు. భీమవరంలో వైద్య కళాశాల లేకపోవడం అక్కడ జిల్లా ఆస్పత్రి ఏర్పాటుకు అవకాశాలున్నాయి. చాలా జిల్లాల్లో రెండు జిల్లా ఆస్పత్రులు ఉన్నాయి. అదేవిధంగా పశ్చిమలో కూడా రెండు జిల్లా ఆస్పత్రులు కొనసాగిస్తారా అనేది ప్రశ్నార్ధకం.
తణుకులో స్పెషలిస్టుల కొరత
రికార్డులలో తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి అయినప్పటికీ స్పెషలిస్టుల కొరత వేధిస్తోంది. ఆరుగురు గైనకాలజిస్టులకు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. మత్తు వైద్యులు మూడు పోస్టలు ఖాళీ. పెనుగొండ, కొవ్వూరు నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కొవ్వూరు తూర్పు గోదావరి జిల్లాలో విలీనం కావడంతో డిప్యుటేషన్ అవకాశాలు కూడా ప్రశ్నార్ధకమే. ఆదివారం, రాత్రి వేళల్లో అత్యవసర సేవలు అందుబాటులో లేనట్టే. జిల్లా ఆసుపత్రి కావడంతో ఆర్థోపెడిక్ ఇద్దరు, జనరల్ మెడిసిన్, సర్జన్ ఇద్దరు చొప్పున అందుబాటులోకి రావడం కొంత ఊరట కలిగిస్తోంది.
నిధులు కేటాయించకుండా శంకుస్థాపన
గత ప్రభుత్వ హయాంలో తణుకులో జిల్లా కేంద్ర ఆస్పత్రి ఏర్పాటైంది. తర్వాత ప్రభుత్వం కూడా మారడంతో స్థల సేకరణ జరగలేదు. నిధులు కేటాయింపు లేదు. కానీ ఆస్పత్రి నిర్మాణానికి ఏడాది క్రితం అప్పటి వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఎలా శంకుస్థాపన చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి నిర్మణానికి అవసరమైన స్థల సేకరణ జరగాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఏడాది గడిచినా ఆస్పత్రి నిర్మాణంలో ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. దీనికి తోడు జిల్లా కేంద్ర ఆస్పత్రి ఇక్కడ ఉంటుందా అనే సందేహం నెలకొంది.