తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలో శ్రీకృష్ణదేవరాయుల కాలంలో నిర్మించిన రాయలచెరువుకు సంబంధించిన గుర్రప్ప తూమును గుర్తు తెలియని వ్యక్తులు పేల్చేశారు. బుధవారం రాత్రి కొంతమంది దుండగులు పురాతన రాతిబండలకు రంధ్రాలు పెట్టి నల్ల మందును అమర్చి పేల్చి వేశారు. గుర్రపు తూముకు గండి పడితే చుట్టు పక్కల గ్రామాలు నీట మునిగే ప్రమాదముంది. ఐతే గత ఏడాది నవంబర్ లో కురిసిన భారీ వర్షాలకు రాయలచెరువులో వరదనీరు భారీగా చేరడంతో రాయలచెరువుకు చుట్టు పక్కల ఉన్న గ్రామాలైన చిట్టతూరు – కాలేపల్లి, సూర్య వారి పల్లి, గొల్లపల్లి, రాయలచెరువు పేట, వడ్డి కాలువ గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. దీని నేపథ్యంలో రాయలచెరువు కట్ట లీకేజయ్యి, తెగి పోతుందేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్, అప్పటి తిరుపతి అర్బన్ ఎస్పీ, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాయలచెరువు కట్టను పరిశీలించారు. ఆఫ్ప్కాన్ సంస్థ సహకారంతో గండిని పూడ్చి లీకేజీని అరికట్టారు. ఎప్పుడూ తాత్కాలిక చర్యలే తప్ప శాశ్వతస్థాయిలో చర్యలు చేపట్టేందుకు విషయంలో అధికారులు, రాజకీయ నాయకులూ ప్రయత్నించటం లేదు..
రాయలచెరువు తూములు ఏవరు పగలగొట్టారు, తూము తలుపులు దొంగిలించినది ఎవరు ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద రాతి కట్టడం తో నిర్మించబడిన పురాతన చెరువు, రాయలచెరువు. శ్రీ కృష్ణదేవరాయలు తన కూతురినే కాపలాగా నిలిపి ప్రజల కోసం రాయలచెరువు నిర్మించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ చెరువు నిండితే రామచంద్రాపురం, వడమాలపేట, రేణిగుంట, తిరుపతి రూరల్, ఏర్పేడు వంటి పలు మండలాల రైతులు పంటలు పండించుకోవడానికి నీరు సమృద్ధిగా ఉంటుంది. చంద్రగిరి, పాకాల, వెదురుకుప్పం మండలాల్లో భూగర్భ జలాలస్థాయి పెరుగుతుంది. ఇలాంటి జీవనాడి అయిన రాయలచెరువులోకి గుర్తు తెలియని వ్యక్తులు వస్తూ ఉంటె అధికారులు, రాజకీయ నాయకులు చూస్తున్నారు తప్ప చర్యలు చేపట్టడం లేదు. గత నవంబరులో కురిసిన వర్షాలకు ఎన్నో డ్యాములు చెరువులు కొట్టుకొని పోగా రాయలచెరువు నిండు కుండలా జలకళను సంతరించుకుంది. అయితే ఇప్పటికే రేడేళ్ళకు ముందు రాయలచెరువు తూములకు అమర్చి ఉండిన తలుపులను రాత్రికి రాత్రే భారీ క్రేన్ సహాయంతో తొలగించి దొంగిలించిన సంఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇంతవరకు స్పందించలేదు. దాని పర్యావసానంగా బుధవారం రాత్రి కొంతమంది రిగ్గు యంత్రంతో గుర్రప్ప తూము పైన అమర్చిన బండరాళ్లను తొలగించారు. దీంతో కట్టకు పగుళ్ళు ఏర్పడ్డాయి. అందువలన వర్షాలు వస్తే చెరువులో నీళ్లు నిలవడం లేదు . అంతేకాక చెరువు భద్రతకే ముప్పు ఏర్పడింది. ఇదంతా కూడా అధికారులకు తెలిసే జరిగి ఉంటుందని, దిగువ ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇంత ఘాతుకానికి దిగిన వారు ఎవరనేది ఇప్పుడు ప్రశ్న. గతంలో తూము తలుపులు తొలగించి దొంగలించిన వారి పనేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రద్దీగా రాకపోకలు సాగే రాయల చెరువుకట్ట పైన రిగ్గు యంత్రం సహాయంతో తూము పైన అమర్చి ఉండిన బండను తొలగించే సాహసం చేశారంటే ఇక రాయలచెరువు ధ్వంసం చేయటానికి వెనుకాడతారా అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.