సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత
సాలకట్ల బ్రహ్మోత్సవాలపై సమీక్ష
ఈసారి మాడ వీధుల్లో వాహనసేవల ఊరేగింపు
తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. తిరుమలలో తొమ్మిది రోజుల పాటు జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలోని స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులు, జిల్లా కలెక్టర్, తిరుపతి అర్బన్ ఎస్పీలతో రెండోసారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ప్రత్యేక దర్శనాలు, వీఐపీ సిఫార్సు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. గరుడ వాహనం రోజున భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తిరుమలలో ద్విచక్ర వాహనాలకు అనుమతిలేదని తెలిపారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాలు : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వరకు జరగనున్నాయి. మాడవీధుల్లో శ్రీవారి వాహనసేవలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరగనుందని ఈవో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. అక్టోబరు 1న గరుడవాహన సేవ, 2న స్వర్ణరథం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం జరుగుతాయన్నారు. కరోనా కారణంగా గతంలో రెండు పర్యాయాలు వాహనసేవలు ఏకాంతంగా నిర్వహించినట్లు తెలిపారు.
ఈసారి మాడ వీధుల్లో వాహనసేవల ఊరేగింపు ఉంటుందని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు, బ్రేక్ దర్శనాలు రద్దుచేస్తామన్నారు. ప్రొటోకాల్ వీఐపీలకే బ్రేక్ దర్శనాలు మంజూరు చేస్తామని వెల్లడించారు. గరుడసేవ రోజున, ముందు, తరువాత రోజు ఆన్‌లైన్‌లో గదుల కేటాయింపు ఉండదని స్పష్టం చేశారు. మిగిలిన రోజులకు సంబంధించి 50 శాతం ఆన్‌లైన్‌లో కేటాయిస్తామని, మిగిలినవి కరెంట్‌బుకింగ్ కింద భక్తులకు ఇస్తామని చెప్పారు. ఈ పర్యాయం విద్యుత్ కటౌట్లను ఏర్పాటు చేయబోమని అన్నారు. భక్తులకు సేవలందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను ఆహ్వానిస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.