ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో అర్హత సాధించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన మెమోను ప్రాంతీయ, జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్‌కుమార్ విడుదల చేశారు. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు, అన్‌ఎయిడెడ్, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా టెట్‌లో అర్హత సాధించాలని పేర్కొన్నారు. ఇప్పటికే పనిచేస్తును ఉపాధ్యాయులు రాబోయే టెట్‌లో అర్హత సాధించాలని తెలిపారు.
తాజా ఆదేశాలతో ప్రైవేటు, ఎయిడెడ్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. ఎయిడెడ్‌లో ఇప్పటికే చాలామంది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద పనిచేస్తున్నారు. వీరికి ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తోంది. ఇప్పుడు వీళ్లంతా AP TET రాయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ప్రస్తుతం చాలా ప్రైవేటు స్కూళ్లలో అసలు డీఈడీ, బీఈడీ అర్హత లేనివారే ఎక్కువ. అలాంటప్పుడు వీరు టెట్ రాయడం అసాధ్యం. చాలా ప్రైవేటు విద్యాసంస్థలు డిగ్రీ, పీజీ పూర్తయిన వారితోనే బోధన సాగిస్తున్నాయి. ఇలాంటివారూ టెట్ రాయడానికి అనర్హులు. గ్రామాల్లోని చిన్న చిన్న పాఠశాలల్లో ఇంటర్ చదువుకున్నవారు బోధిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం టెట్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు ఇరుకునపడ్డారు.
ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. టెట్ (Teacher Eligibility Test) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ AP TET 2022 పరక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లో ఉంచారు. దీనికి ఉపాధ్యాయ నియామక పరీక్షలో 20% వెయిటేజీ కూడా ఉంది. అభ్యర్థులు 1-5 తరగతుల బోధనకు పేపర్-1(ఎ, బి); 6-8 తరగతుల బోధనకు పేపర్-2(ఎ, బి)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో AP TET 2022 పరీక్షకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. టెట్ దరఖాస్తు ఫీజును ఒక్కో పేపర్‌కు రూ.500గా నిర్ణయించారు. టెట్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ , ఫీజు చెల్లింపు దరఖాస్తుల సమర్పణకు జులై 16 వరకు గడువు ఉంటుంది.
అర్హతలు: పేపర్‌ను బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్/ యూజీడీపీఈడీ/ డీపీఈడీ/ బీపీఈడీ లేదా తత్సమానం. 2020-22 విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే అభ్యర్థులూ అర్హులే. ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. పేద ప్రజలకు సిఎం జగన్ నవరత్నాలు పథకం ద్వారా అనేక విధాలుగా సహాయం అందజేస్తున్న తరుణంలో 1.16 లక్షల మంది ఉన్న ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవటానికి స్పందించకపోవటం సరికాదన్నారు.