30/08/2022
ఏపీ జెన్కోకు బకాయిలను వడ్డీతో కలిపి చెల్లించాలని తెలంగాణ విద్యుత్ సంస్థలను కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. జెన్కో సరఫరా చేసిన విద్యుత్‌కు రూ.3,441.78 కోట్లు, దీని చెల్లింపులో జాప్యానికి సర్‌ఛార్జీ రూపంలో రూ.3,315.14 కోట్లు (2022 జులై 31 వరకు) కలిపి మొత్తంగా రూ.6,756.92 కోట్లు నెల రోజుల్లో చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఎక్కువ ఉంటున్న కారణంగా విభజన చట్టంలో 57 శాతం కరెంట్ ను తెలంగాణకు కేటాయించారు. ఏపీకి కేవలం 43 శాతం కేటాయించారు. అదనంగా ఇస్తున్న కరెంట్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు డబ్బులు చెల్లించాలి. మూడున్నరేళ్ల పాటు కరెంట్ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అడిగి,అడిగి చివరికి ఏపీ ప్రభుత్వం కరెంట్ సరఫరాను తెలంగాణ ప్రభుత్వానికి నిలిపి వేసింది. అయినప్పటికీ కరెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు వేసింది. తెలంగాణ జెన్కోను దివాళా తీసినట్లుగా ప్రకటించి తమకు రావాల్సిన నిధులు తమకు ఇప్పించాలని కోరింది.
అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిల గురించి తెలంగాణ ప్రభుత్వం ఏమీ చెప్పనప్పటికీ NCLTలో పిటిషన్ ఉపసంహరించుకుంది. రెండున్నరేళ్ల పాటు ఒక్క రూపాయి చెల్లించమని అడగలేదు. కానీ గత సెప్టెంబర్‌లో ఆంధ్రా ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విద్యుత్ సరఫరా చేసినందుకు రూ.3,441 కోట్లు, 2017 జూన్ నాటికి రూ.2,841 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉందని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది.దీనిమీద తెలంగాణ సర్కార్ ఏపీకి తాము ఇవ్వడం కాదు,తమకే ఏపీ డబ్బులు ఇవ్వాలని అంటోంది. ఏపీ నుంచే తమకు ఐదు వేల వరకూ కోట్లు ఇవ్వాల్సి ఉందని,లెక్కలు చూసుకుందాం రమ్మంటే రావడం లేదని ఆరోపిస్తోంది. ఈ వివాదం ప్రస్తుతం హైకోర్టులో ఉంది.
అయితే కేంద్రం వద్ద తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి జగన్ ఆ డబ్బులు ఇవ్వాలని ఆదేశాలు తెప్పించుకున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది కీలకం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అప్పులు కూడా పుట్టక తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు కొత్తగా కోర్టులో ఉన్న దానికి డబ్బులు చెల్లించమంటే,కెసిఆర్ ఎలా స్పందిస్తారు అన్నది కీలకం. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తనకు చేతనైనంతగా చేసి ఆదేశాలు తెచ్చుకుంది.