ఇటీవలి కాలంలో వాట్సాప్ యూజర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న అంశం గోప్యత. వాట్సాప్‌లో మన ఉనికి ఇతరులకు తెలియకుండా ఉండేందుకు లాస్ట్ సీన్, స్టేటస్ హైడ్ వంటి ప్రైవసీ ఫీచర్లున్నాయి. తాజాగా యూజర్ ప్రైవసీ కోసం వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. దీంతోపాటు మెసేజ్ రియాక్షన్‌కు కొత్తగా మరిన్ని ఎమోజీలను జోడించడంతోపాటు మరో మూడు కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనుంది. మరి వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్లేంటి.. వాటితో యూజర్లకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తాయో తెలుసుకుందాం.
ఛాట్ పేజీలో యూజర్ ఐకాన్ కింద ఆన్లైన్ స్టేటస్ ద్వారా యూజర్ ఆన్లైన్లో ఉన్నారా? ఆఫ్‌లైన్‌లో ఉన్నారా? అనేది తెలుస్తుంది. అక్కడ స్టేటస్ ఆన్లైన్ అని చూపిస్తే, యూజర్ ఆన్లైన్లో ఉన్నట్లు. ఒకవేళ ఆన్లైన్ అని చూపించకుంటే ఆఫ్‌లైన్‌లో ఉన్నట్లుగా భావించాలి. వాట్సాప్ తాజాగా తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్లు ఈ స్టేటస్ కూడా ఇతరులకు కనబడకుండా చేయొచ్చు. అంటే ఆన్లైన్లో ఉన్నట్లు అవతలి వారికి తెలియదు. వాట్సాప్‌లో ఏదైనా ఫొటో షేర్ చేసే ముందు అందులో చిన్న చిన్న మార్పులు చేసుకునేందుకు వీలుగా మీడియా ఎడిటర్ ఆప్షన్ ఉంది. దీంతో యూజర్లు ఫొటోను క్రాప్, రొటేట్ చేయడంతోపాటు టెక్ట్స్, ఎమోజీ, స్టిక్కర్లు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటికి అదనంగా బ్లర్ టూల్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. దీంతో యూజర్లు ఫొటోలో ఏదైనా ప్రాంతాన్ని బ్లర్ చేసి ఇతరులకు పంపొచ్చు. త్వరలోనే ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుందని బీటా ఇన్ఫో వెల్లడించింది.
బిజినెస్ ఖాతాదారుల కోసం వాట్సాప్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. సాధారణ ఖాతాలకు భిన్నంగా ప్రీమియం యూజర్లకు కొన్ని అదనపు ఫీచర్లు అందుబాటులోకి వస్తాయట. దీంతో బిజినెస్ ఖాతాదారులు ఒకేసారి 10 డివైజ్‌లలో వాట్సాప్‌ను లాగిన్ చేయొచ్చు. అలానే బిజినెస్ అవసరాలకు సంబంధించి ఫోన్ నంబర్‌తో కూడిన షార్ట్ లింక్‌ను సులువుగా క్రియేట్ చేసి ఇతరులతో షేర్ చేసుకోవచ్చని బీటా ఇన్ఫో తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ కూడా పరీక్షల దశలో ఉందని, త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.