విజయవాడ చిట్టినగర్ లో కొలువై ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే సహస్ర కలశయాత్ర పేరిట వందలాది మంది భక్తులు కృష్ణా నది నుండి పవిత్ర జలాలను తీసుకు వచ్చిన అనంతరం ఉత్సవ మూర్తులకు సహస్రకలశాభిషేకం చేసి స్వామి వారిని పెండ్లి కుమారునిగా చేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగరాల సంఘం నాయకులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఏటా దేవస్థానం పాలకవర్గం ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు ,కార్యదర్శి మరుపి ళ్ల హనుమంతరావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా అనంతరం నిర్వహిస్తున్న శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తమ పాలకవర్గం కృషి చేస్తోందని చెప్పారు.
ఈ నెల 18వ తేదీ వరకు శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చేయడం జరిగిందని వారు వివరించారు.