అస్మత్ తెగ గురించి ఎప్పుడైనా విన్నారా ? పేరే కొత్తగా ఉందని అనుకుంటున్నారా. అవునండి నిజమే ఈ తెగ ఉంది. ఈ తెగలో కొన్ని వింత ఆచారాలు కూడా ఉన్నాయి. మనం రాకెట్లు వేసుకుని అంతరిక్షానికి వెళ్తూ ఉన్నా కూడా ఇంకా కొన్ని తెగలు ఇప్పటికీ పాతకాలపు సంప్రదాయాలనే పాటిస్తున్నారు. కాలం మారే కొద్దీ ప్రజలు, వాళ్ళ స్థితిగతులు కూడా మారుతూ ఉంటాయి. వాళ్ళ జీవన విధానంలో కూడా చాలా మార్పులు జరుగుతాయి. కొంతమంది మాత్రం ఈ ఆధునిక సమాజానికి దూరంగా బతుకుతున్నారు అంటే ఇంకా ఆది మానవుల్లా బతుకుతున్నారు. అందుకే మనతో పోల్చితే వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు చాలా డిఫరెంట్ గా, భయంకరంగా ఉంటాయి. జనరల్ గా ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేస్తారు. సంప్రదాయం ప్రకారం ఖననం చేస్తారు లేదా దహనం చేస్తారు. కానీ ఒక తెగ ప్రజలు మాత్రం అలా చేయరు. ఆ శవాన్ని ముక్కలు చేసి ఆకుల మధ్యలో పెట్టి ఉడికించుకుని తినేస్తారు. ఇంతకు ఆ తెగ మనుషులు ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారా ?
న్యూగినియాలోని దట్టమైన అడవుల మధ్య ఉంది. ఈ తెగ పేరు అస్మత్ తెగ. వీళ్ళు నరమాంస భక్షకులు. ఐతే నరమాంస
భక్షకులు అనగానే మన దేశంలో అందరూ అఘోరాలే అనుకుంటారు. కానీ వారి కంటే ప్రమాదకరమైన మనుషులు ప్రపంచంలోని వేరే దేశాల్లో కూడా ఉన్నారనే విషయం చాలామందికి తెలియదు. కొన్ని దేశాల్లో తమ శత్రువుల శవాలను ఇంటికి తీసుకెళ్లి విందు చేసుకునే సాంప్రదాయాన్ని ఇంకా పాటిస్తున్నారు. న్యూగినియాలో నివసించే ఈ అస్మత్ ఆదివాసీ తెగ చాలా ప్రమాదకరమైన తెగ. వీరు మనుషులు కనిపిస్తే చాలు చంపుకుని మరీ తినేస్తారు. ఈ విషయం అక్కడ పర్యటించిన ఓ ఇంగ్లీష్ జర్నలిస్టు కూడా ఒక కధనంలో రాశాడు. చనిపోయిన వ్యక్తి మెదడును బటయకు తీసి ఆకులో ఉడికించి, నిప్పుల్లో కాల్చి తింటారని తెలిపారు. 1961లో రాజవంశానికి చెందిన నెల్సన్ రాక్‌ఫెల్లర్ ఐదవ కుమారుడు మైఖేల్ రాక్‌ఫెల్లర్‌ను ఈ తెగ ప్రజలు హత్య చేసి ఆయన మాంసాన్ని కూడా భక్షించారని ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రమాదవశాత్తు అతడు ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడింది. దీంతో అతడు ఈదుకుంటూ ఈ తెగ నివసిస్తున్న ప్రాంతానికి చేరాడు. దీంతో అస్మత్ తెగ ప్రజలు అతడిని హత్య చేసి తినేశాడని అప్పట్లో వార్తలు ప్రచురితమయ్యాయి.
ఈ తెగ వారు ముఖ్యంగా వేటలో ఆరితేరిన వాళ్ళు. ప్రపంచంలోనే ఎంతో నైపుణ్యం కలిగిన వేటగాళ్లలో ఈ తెగకు ప్రత్యేకమైన పేరు ఉంది. ఇదే కాకుండా ఈ తెగ ప్రజల్లో ఒక సంస్కృతి ఉంది. అది ఏంటంటే వాళ్ళు తమ శత్రువులను వెంటాడి..వేటాడతారు..చివరికి వాళ్ళను చంపేసి తల నుంచి చర్మాన్ని వేరు చేసేస్తారు. ఈ తెగ ప్రజలు చూడడానికి చాలా భయంకరంగా ఉంటారు. చర్మాన్ని మొత్తం వలిచేసాక మిగిలిన పుర్రెని కూడా వివిధ రకాలుగా ఉపయోగించుకుంటారు. ఎలా అంటే ఈ పుర్రెలను వాళ్ళ శౌర్యానికి ప్రతీకగా వాళ్ళ ఇళ్లల్లో అలంకరించుకుంటారు. ఇంట్లో ఎన్ని పుర్రెలు ఉంటె అంత పెద్ద వీరులుగా భావిస్తుంటారు. అలాగే శత్రువుల పుర్రెలను కొన్నిసార్లు రెండు భాగాలుగా కోసి..వాటిని గిన్నెల్లా వాడుకుంటారు. కొంతమంది మాత్రం పుర్రెలపైనే నిద్రపోతారు. ఆ కాపాలాన్ని తల కింద దిండులా పెట్టుకుని పడుకుంటారు. ఇంకా వీళ్ళు ఈ పుర్రెలను అందంగా అలంకరించాడానికి ఎంతో కష్టపడతారు. ఇక ఈ పుర్రె చాలా పవిత్రమైనదిగా ఈ తెగ ప్రజలు నమ్ముతారు. అందుకే ఒక తరం నుంచి మరొక తరానికి ఈ పుర్రెల్ని వారసత్వ సంపదగా అందిస్తారు.