ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఆర్టీసీ బాదుడు మొదలైంది. డీజిల్ సెస్ పేరుతో శుక్రవారం నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సుల ఛార్జీలు భారీగా పెరిగాయి. ఇక ఇప్పటి నుంచి డీజిల్ సెస్ ను దూరాన్ని బట్టి పెంచనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆర్టీసీ చార్జీలు భారీగా పెరగనున్నాయి. సాధారణంగా ప్రయాణ దూరాన్ని బట్టి కనిష్టంగా 10 రూపాయలు, గరిష్టంగా 140 రూపాయలకు పైగా ఆర్టీసీ డీజిల్ సెస్ వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. బేసిక్ ఛార్జీ, డీజిల్ సెస్ కలిపి కిలోమీటర్ల ప్రతిపాదికన మొత్తం ఛార్జీని నిర్ణయించింది ప్రభుత్వం. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు మినహా అన్ని బస్సుల్లో కనీస ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జీని 5 రూపాయల మేర పెంచగా.. దూరప్రాంతలు వెళ్లే ఏసీ, నాన్ ఎసీ, స్లీపర్ బస్సుల్లో కనీస ఛార్జీని 10 రూపాయల మేర పెంచింది. వీటిలో కనీస ఛార్జీ 10 రూపాయలు యథాతథంగా ఉంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఛార్జీల పెంపుతో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కనీస ఛార్జీ 20 రూపాయలుగా, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో 25 రూపాయలుగా, సూపర్ లగ్జరీ బస్సుల్లో 40 రూపాయలుగా, ఇంద్ర బస్సుల్లో 50 రూపాయలుగా, గరుడ బస్సుల్లో 50 రూపాయలుగా, మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో 50 రూపాయలుగా, అమరావతి ఎసీ బస్సుల్లో 50 రూపాయలుగా, వెన్నెల స్లీపర్ బస్సుల్లో కనీస ఛార్జీ 80 రూపాయలు వసూలు చేయనున్నారు.
అయితే.. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో తిరుపతి-తిరుమల మధ్య తిరిగే ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ప్రయాణికులపై ప్రతి టికెట్ పై 15 రూపాయలు అదనపు భారం పడనుంది. ప్రస్తుతం ఛార్జీ 75 రూపాయలు ఉండగా.. ఛార్జీల పెంపుతో 90 రూపాయలుగా మారింది. అటు పిల్లల టికెట్ ధర 45 రూపాయలు నుంచి 50 రూపాయలకు పెరిగింది. 2018లో తిరుపతి నుంచి తిరుమలకు టికెట్ 50 రూపాయలుగా ఉండగా..గడిచిన నాలుగేళ్లలో ఏకంగా 40 రూపాయలు పెరిగింది.
ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సామాన్యుడిపై భారం మోపడమే! అని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. ఇంటి పన్ను పెంపు , చేత్త మీద పన్ను , కరెంట్ చార్జీలు పెంచడం , ఇసుక ధర , సిమెంట్ ధర, రిజిస్ట్రేషన్ చార్జీలు ధరలు పెంచడం వైకాపా పాలనలో అన్ని పెంచడం తప్ప మీరు ప్రజలకు పంచింది ఏముంది సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పేద , మద్య తరగతి ప్రజలు ప్రయాణించే పల్లెవెలుగు సర్వీసుల్లో గరిష్టంగా రూ.25, ఎక్స్ ప్రెస్ లో రూ.90, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ రూ.120,ఏసీ సర్వీసుల్లో రూ.140 పెంచారు. పెంచిన చార్జీలను తక్షణం తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలు
ఏపీఎస్ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచింది. పెరిగిన టికెట్ ధరలు రేపటి నుంచే అమల్లోకి వస్తాయి అని.
డీజిల్ సెస్ పెంపుతో బస్సు చార్జీలను పెంచక తప్పడం లేదని ఆర్టీసీ ఎండీ తిరుమలరావు పేర్కొన్నారు.
అయితే సీటీ బస్సులకు మినహాయింపు ఇస్తున్నామన్నారు. పల్లె వెలుగు, ఆర్డినరీ సర్వీసుల్లో అదనంగా రూ.2, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.5, ఏసీ బస్సుల్లో రూ.10 అదనంగా పెంచుతున్నామన్నారు.
పెంపు ఇలా..
పల్లెవెలుగు బస్సుల్లో మినిమమ్ డీజిల్ సెస్ రూ. 10
ఆల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో మినిమమ్ డీజిల్ సెస్ రూ. 10
ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మినిమమ్ డీజిల్ సెస్ రూ. 20
ఆల్ట్రా డీలక్స్ బస్సుల్లో మినిమమ్ డీజిల్ సెస్ రూ. 25
సూపర్ లక్సరీ బస్సుల్లో మినిమమ్ డీజిల్ సెస్ రూ. 40
ఇంద్రా బస్సుల్లో మినిమమ్ డీజిల్ సెస్ రూ. 50
గరుడ బస్సుల్లో మినిమమ్ డీజిల్ సెస్ రూ. 50
అమరావతి బస్సుల్లో మినిమమ్ డీజిల్ సెస్ రూ. 50
డాల్ఫిన్ క్రూజ్‌బస్సుల్లో మినిమమ్ డీజిల్ సెస్ రూ. 50
నైట్ రైడర్ బస్సుల్లో మినిమమ్ డీజిల్ సెస్ రూ. 50
నైట్ రైడర్ బెర్త్ బస్సుల్లో మినిమమ్ డీజిల్ సెస్ రూ. 80
వెన్నెల స్లీపర్ బస్సుల్లో మినిమమ్ డీజిల్ సెస్ రూ. 80
మెట్రో లక్సరీ బస్సుల్లో మినిమమ్ డీజిల్ సెస్ రూ. 50