దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ఖారారైంది. జులై 18న తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు(ఏకగ్రీవం కాకపోతే) కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో షెడ్యూల్ను సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలలో పోలింగ్ జరగుతుందని సీఈసీ చెప్పారు.ఎన్నిలకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని వివరించారు. ఓటింగ్‌లో పాల్గొనే ఓటర్ల మొత్తం ఓట్ల విలువ 10,86,431 అని సీఈసీ తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థిని కనీసం 50 మంది బలపరచాలని పేర్కొన్నారు.
షెడ్యూల్ ఇదే..
జూన్ 15న నోటిఫికేషన్ విడుదల
జూన్ 29 వరకు నామినేషన్ దాఖలుకు గడువు
జూన్ 30న నామినేషన్ పరిశీలన
జులై 2న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
జులై 18న పోలింగ్ (ఏకగ్రీవం కాకపోతే)
జులై 21న ఓట్ల లెక్కింపు
జులై 25 కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం
ఎలక్టోరల్ కాలేజీ పద్ధతిలో
రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, దిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ సభ్యులుంటారు. వీరు ఓటు హక్కు ద్వారా ప్రథమ పౌరుడిని ఎన్నుకొంటారు. రాజ్యసభ, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని నామినేటెడ్ సభ్యులు, రాష్ట్రాల శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో ఉండరు. అందుకే వాళ్లకి ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. 6వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి తర్వాత బాధ్యతలు చేపట్టిన వారందరూ జులై 25వ తేదీనే ప్రమాణస్వీకారం చేశారు.
కొత్త రాష్ట్రపతి కూడా అదే తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికకు పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీచేయకూడదు. ఓటేయడానికి, గైర్హాజరు కావడానికి ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పటివరకూ ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఓటింగ్ రహస్య బ్యాలట్ పేపర్ విధానంలో జరుగుతుంది. ఓటింగ్ చేయాల్సిన పెన్నును కేంద్ర ఎన్నికల సంఘమే ఇస్తుంది. ఆ పెన్నుతోనే ఓటేయాల్సి ఉంటుంది. వేరే దాంతో వేస్తే అది రద్దవుతుంది.
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీ మొత్తం ఓట్ల విలువలో ఎన్డీఏకు 49శాతం, యూపీఏకు 24.02శాతం, ఇతర పార్టీలకు 26.98శాతం బలం ఉంది. గతంలో కంటే ఈ సారి ఎన్డీఏ బలం కొంత ఎక్కువగానే ఉంది. గతంలో ఎన్డీఏ కూటమి పార్టీలతోపాటు, బయట నుంచి ఏఐఏడీఎంకే, వైకాపా, జేడీయూ, బీజేడీ, తెరాస, ఐఎన్‌ఎల్‌డీ, స్వతంత్రులు మద్దతివ్వడంతో రామ్‌నాథ్ కోవింద్‌కు 7,02,044 (65.65శాతం) ఓట్లు, యూపీఏ అభ్యర్థి మీరాకుమార్‌కు 3,67,314 (34.35శాతం) ఓట్లు వచ్చాయి. క్రితంసారి తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఆర్‌జేడీ లాంటి పార్టీలు యూపీఏ అభ్యర్థికి మద్దతిచ్చాయి.
2017లో ఇలా..
2017లో 15వ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 7వ తేదీన షెడ్యూల్ విడుదల చేసింది. అప్పటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నసీం అహ్మద్ జైదీ తేదీలను ప్రకటించారు. ఆ ఏడాది జూన్ 14 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 28వ తేదీతో ముగిసింది.
జులై 25వ తేదీన రామ్‌నాథ్ కోవింద్ చేత అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయించారు…
వెంకయ్యనాయుడుకి వైసీపీ నో? తమిళ సైకి టీఆర్ఎస్ నో?
రాష్ట్రపతి పదవికి జరగాల్సిన ఎన్నిక దగ్గర పడుతోంది. ఎవర్ని ఎంపిక చేయాలన్న విషయంపై కేంద్రంలో అధికారంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి అవసరమైన బలానికి కూతవేటు దూరంలో (1.2 శాతం ఓట్లు) నిలిచింది. ఆ కూతవేటు బలాన్ని వైసీపీద్వారాకానీ, బీజేడీద్వారాకానీ, అన్నాడీఎంకేద్వారా కానీ సమకూర్చుకోగలమనే ఆత్మవిశ్వాసంతో మోడీ ప్రభుత్వం ఉంది.
వెంకయ్యనాయుడైతే కష్టమేనండి?
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇటీవలే దేశవ్యాప్తంగా పర్యటించారు. ఆయనైతే రాజకీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించడానికి సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. అయితే మూడు సంవత్సరాల నుంచి లోక్‌సభలోకానీ, రాజ్యసభలోకానీ బలం తగ్గినప్పుడల్లా ఆదుకుంటున్న వైసీపీ వెంకయ్యనాయుడైతే మద్దతిచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పినట్లు ఢిల్లీలోని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి నుంచి మద్దతిస్తున్న వైసీపీ మాటను కాదనుకుండా గౌరవిద్దామా? లేదంటే వైసీపీని ఒప్పిద్దామానా? అనే చర్చలు కూడా బీజేపీలో నడుస్తున్నాయి. వెంకయ్యనాయుడి శరీరం బీజేపీలో, మనసు తెలుగుదేశంలో ఉంటుందని గతంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఉప రాష్ట్రపతిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది.
తెలంగాణ ప్రభుత్వానికి, తమిళసైకి హోరాహోరీ యుద్ధం!
తమిళసై సౌందరరాజన్‌కు కూడా అవకాశం ఉంది. కానీ బీజేపీ మీద యుద్ధాన్ని ప్రకటించి కేసీఆర్ సౌందరరాజన్‌ను ఒకవేళ ఎంపిక చేస్తే ఆమెకు అవకాశం లేకుండా చేయడానికి వ్యూహాలు పన్నుతున్నట్లు తెలంగాణ రాష్ట్రసమితి వర్గాలు చెబుతున్నాయి. కొన్నాళ్లుగా తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళసైకి, అధికార టీఆర్ఎస్‌కు హోరాహోరీ యుద్ధం నడుస్తోంది. కొన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ నేరుగా జోక్యం చేసుకుంటున్నారని టీఆర్ఎస్ ఆరోపణ. తాజాగా ఆమె మహిళా దర్బార్ నిర్వహించి రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. తనను కలిసిన మహిళలంతా రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారల గురించే చెబుతున్నారరి తమిళసై చెప్పారు. తెలంగాణ మహిళల కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎదురు చెప్పేవాళ్లను తాను పట్టించుకోనని, తననెవరూ అడ్డుకోలేరని ఆమె వ్యాఖ్యానించారు
శరద్‌పవారా? అన్నా హజారేనా?
నాలుగురోజుల క్రితం సంచలనం నమోదవుతుందని ప్రకటించిన కేసీఆర్ మాట రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక గురించేనని అందరూ భావిస్తున్నారు. శరద్‌పవార్ అయితే ప్రతిపక్షాలతోపాటు బీజేపీ పక్షాలు కూడా మద్దతిస్తాయనేది కేసీఆర్ యోచనగా ఉంది. అయితే శరద్‌పవార్ ఏ విషయం తేల్చలేదు. అన్నాహజారేను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలనేది కేసీఆర్ రెండో ప్రణాళికగా ఉంది. ప్రస్తుతానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది కాబట్టి ఇంకా ఎన్ని రాజకీయ పరిణామాలు సంభవిస్తాయో వేచిచూడాల్సి ఉంది.