నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ అధికారులు సోమవారం మరోసారి విచారించనున్నారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజులపాటు రాహుల్ ను ఈడీ అధికారులు విచారించిన విషయం విధితమే. తిరిగి 17న విచారణకు రావాలని ఆదేశించారు. అయితే కాంగ్రెస్ అధినేత్రి, రాహుల్ తల్లి సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సోమవారానికి విచారణ వాయిదా వేయాలని రాహుల్ కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు ఈడీ అధికారులు సోమవారం మరోసారి విచారణకు సిద్ధమయ్యారు.
ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు రాహుల్ గాంధీని మూడు రోజులు 30 గంటల పాటు విచారించారు. ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులు వైఐఎల్ కి బదలాయింపు, షేర్ల వాటాలు, ఆర్ధిక లావాదేవీల అంశాలపై రాహుల్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఇదే కేసులో జూన్ 23న ఈడీ ఎదుట కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా హాజరు కావాల్సి ఉంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో సోనియాను ప్రస్తుతానికి విచారణ నుంచి అధికారులు మినహాయించారు. ఆమె కోలుకోగానే విచారించే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ పట్ల కేంద్రం కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలపనున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నిరసనలు శాంతియుతంగా చేపట్టాలని ఆయన కోరారు. నిరసనలతో పాటు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కాంగ్రెస్ నేతల బృందం కలవనుంది. రాహుల్ గాంధీ ఈడీ విచారణ, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, కాంగ్రెస్ ఎంపీలపై ఢిల్లీ పోలీసులు జరిపిన దాడులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు.
రాహుల్, సోనియా గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నేషనల్ హెరాల్డ్ పత్రికకు యాజమాన్య సంస్థ. అయితే, యంగ్ ఇండియన్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాంగ్రెస్ కు నేషనల్ హెరాల్డ్ బకాయి పడ్డ సుమారు 90 కోట్లను వసూలు చేసుకునే హక్కును కేవలం 50 లక్షలు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2012లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో భాగంగా ఇప్పుడు ఈడీ రాహుల్ గాంధీని ప్రశ్నిస్తోంది. మరోవైపు, ఈడీ విచారణను నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. మోడీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలపనున్నారు.