కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ నమోదు చేసిన నేషనల్ హెరాల్డ్ కేసు, మూడు రోజులుగా ఢిల్లీలో సాగుతున్న విచారణ దేశ రాజధానిని వేడెక్కించాయి. వరుసగా మూడో రోజు ఈడీ విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ క్రమంలో వరుసగా మూడో రోజు ఈడీ ముందుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. గడిచిన 2 రోజుల్లో 21 గంటలపాటు ఈడీ ప్రశ్నించింది. అదే సమయంలో రాహుల్ కు మద్దతుగా ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ఎత్తున నిరసనలు చేపడుతోంది. దీంతో ఉద్రిక్త పరరిస్ధితులు తలెత్తుతున్నాయి ..ఏఐసీసీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. చత్తీస్‌ఘడ్ సీఎం భూపేశ్ భగల్, కేసీ వేణుగోపాల్‌తో పాటు మరికొంత మంది నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే పోలీసులు గుండాయిజం చేస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ ఆరోపించారు. భారత దేశ చరిత్రలో ఎప్పుడూ ఇంత అరాచకాన్ని చూడలేదన్నారు..తొలిరోజు 10 గంటల పాటు, రెండో రోజు 11 గంటల పాటు విచారణ జరిపిన ఈడీ.. ఇప్పటికే ఈ కేసులో పలు కీలక విషయాలకు సంబంధించిన ప్రశ్నలను విచారణలో అడిగినట్లు సమాచారం. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు దేశవ్యాప్తంగా రాహుల్ విచారణపై కాంగ్రస్ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ నిరసన సందర్భంగా పోలీసులు నెట్టివేయడంతో సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ. చిదంబరం ఎడమ పక్కటెముకలో ఫ్రాక్చర్ అయ్యిందని మరో నేత రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు.
కాంగ్రెస్ ఆగ్రహం
ఢిల్లీ పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో.. కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. కాంగ్రెస్ కార్యకర్తలను ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం, ఆపై కార్యాలయంలోనే కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అక్బర్‌రోడ్డు వద్ద ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు ఢిల్లీ పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఒకానొక టైంలో ఏఐసీసీ గేట్లు బద్ధలు కొట్టి పోలీసులు కార్యాయంలోకి వచ్చి, తమ నేతలను అరెస్ట్ చేసినట్లు కాంగ్రెస్ ఆరోపణలకు దిగింది. ఈ పరిణామంపై పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా తీవ్రంగా స్పందించారు. అసలు పార్టీ కార్యాలయంలోకి పోలీసులు ఎలా వస్తారని నిలదీశారు. పోలీసులు గుండాల్లా ప్రవర్తించారని మండిపడ్డారాయన.
కాంగ్రెస్ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఏఐసీసీ కార్యాలయం దగ్గర చాలా మంది వ్యక్తులు పోలీసులపై బారికేడ్లు విసిరారు. కాబట్టి గొడవ జరిగి ఉండవచ్చు. అంతేగానీ పోలీసులు ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లి లాఠీఛార్జ్ చేయలేదు. పోలీసులు ఎలాంటి బలప్రయోగం చేయడం లేదు. మాతో సమన్వయం చేసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తాం అని ఎస్పీ హుడా, స్పెషల్ సీపీ (ఎల్‌అండ్‌ఓ) తెలిపారు. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు.
ఇదిలా ఉంటే.. ఏఐసీసీ కార్యాలయం వద్ద జరిగిన పరిణామంపై కాంగ్రెస్ నిరసనలకు పిలుపు ఇచ్చింది. గురువారం రాజ్‌భవన్ల ముట్టడికి ఏఐసీసీ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపులో భాగంగా.. తెలంగాణలో రాజ్‌భవన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టనున్నాయి. రాహుల్‌పై కేంద్రం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందని తెలంగాణ కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఇక, హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్ నేతలు ఈడీ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా నిరసనల్లో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జగ్గారెడ్డి ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెట్రోల్ బాటిల్స్‌తో వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు.. జగ్గారెడ్డిని అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఈడీ ఆఫీసు ఎదుట ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.