ఉడుతకు పోస్టుమార్టం చేయడం ఏమిటో అసలు పోస్టుమార్టంలో ఏం తేలుస్తారో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఉడుత వైర్లను కొరకలేదని సులువుగా తెలుసుకోవచ్చు. హై టెన్షన్ వైర్లు మెషిన్‌తో కట్ చేసినా తెగనంత గట్టిగా ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు.సత్యసాయి జిల్లాలో హైటెన్షన్ వైర్లు తెగిపడిన ఘటనలో ఐదుగురు కూలీలు సజీవ దహనం అయ్యారు. ఉడత కొరికితేనే వైర్ తెగిందని విద్యుత్ అధికారులు ప్రకటించారు. దానిపై విమర్శలు వచ్చాయి. కరెంట్ స్తంభం పైన ఉడత చనిపోయి ఉంది. దాంతో అదే నిజమని నిరూపించేందుకు ముందూ వెనుకా చూసుకోకుండా ఉడుతకు పోస్టు మార్టం చేయాలని నిర్ణయించారు.చేయాల్సింది ఉడతకు శవవరీక్ష కాదని.. విద్యుత్ తీగల నాణ్యాతా పరీక్ష అని నిపుణులు చెబుతున్నారు. అంత నాసిరకంగా ఉన్నాయా లేదో నిపుణుల చేత వైర్లను పరీక్షింప చేయాలంటున్నారు. కానీ ప్రభుత్వం ఎలా ఉందో.. అధికారులూ అలాగే ఉన్నారు.
శ్రీసత్యసాయి జిల్లాలో ఐదుగురు కూలీలను బలిగొన్న విద్యుదాఘాత ప్రమాదంలో అనూహ్యంగా తెరపైకి తెచ్చిన ఉడత కథను అధికారులు మరో విచిత్ర మలుపు తిప్పారు. ఉడతను ముద్దాయిని చేసిన అధికారులు…దానికి ఏకంగా పోస్టుమార్టం కూడా చేయించారు. ఉడత వల్లనే కరెంటు వైరు తెగి ఆటోపై పడి..అందులో ప్రయాణిస్తున్న కూలీలను బలిగొన్నదని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఉడత చుట్టూ దర్యాప్తు మొదలైంది. విచారణకు వచ్చిన అధికారులందరూ ఉడత ఎక్కడ కనిపించింది? వైర్లకు ఎక్కడ తగులుకుంది? ఎక్కడ పడిపోయింది? అని ఆరాతీశారు. అదేరోజు సాయంత్రం తాడిమర్రి పోలీసులు ఉడత కళేబరాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక పశువైద్యశాలకు తరలించారు. ఎస్‌ఐ లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు పశువైద్య అధికారి స్వర్ణలత ఉడతకు గురువారం పోస్టుమార్టం చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికను బహిర్గతం చేసేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేయలేదు.
మొదలైన విచారణప్రమాదంపై విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. వివరాలు అడిగితే మాత్రం ఒకరిపై ఒకరు చెప్పుకొని వెళ్లిపోయారు. తిరుపతి నుంచి వచ్చిన చీఫ్ విజిలెన్స్ మహిళా అధికారి లావణ్య లక్ష్మి, ఈఈ జేవీ రమేశ్ శుక్రవారం గుడ్డంపల్లి గ్రామానికి వెళ్లారు. ప్రమాదం నుంచి బయటపడినవారిని విచారించారు. వారి నుంచి సమాచారం సేకరించి, రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. ఆ తరువాత ప్రమాద స్థలానికి చేరుకుని, దగ్ధమైన ఆటోను, తెగి పడ్డ విద్యుత్ వైరును పరిశీలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఏ వైరులో విద్యుత్ సరఫరా అవుతుందని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. మధ్య వైరులో సింగిల్ ఫేస్ కరెంటు సరాఫరా అవుతోందని, ఉదయం ఎనిమిది గంటలకు త్రీ ఫేస్ కరెంట్ ఇవ్వాల్సి ఉంటుందని స్థానిక అధికారులు వివరించారు.
ప్రమాదం జరిగినప్పుడు దాడితోట సబ్‌స్టేషన్‌లో లైన్ ట్రిప్ అయిందా లేదా అనేది ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఉద్యోగి రాఘవను అడిగి తెలుసుకున్నారు. లాగ్‌బుక్‌ను తెప్పించుకుని, తాడిమర్రి సబ్ స్టేషన్‌లో రహస్యంగా ఆయనను విచారించారు. ప్రమాద సమయంలో ఎంతస్థాయి కరెంటు ప్రవహిస్తోందని అడిగి నమోదు చేసుకున్నారు. వైరు తెగిపడటంలో ఉడత ప్రభావం ఏమైనా ఉంటుందా అంటూ వారు చర్చించుకున్నారు. విచారణ వివరాలను తెలపాలని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో లావణ్యలక్ష్మిని కోరగా ‘మా ఇన్‌స్పెక్టర్ చెబుతారు’ అంటూ కారులో వెళ్లిపోయారు. ఆ వెనుకనే వచ్చిన విజిలెన్స్ సీఐ విజయ్ భాస్కర్‌రెడ్డి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారు.
ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు సమాధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేతికి అందేంత ఎత్తులో విద్యుత్ హై టెన్షన్ వైర్లు ఉన్నా పట్టించుకోకటం..పైగా ఇటువంటి తలతిక్క సమాధానాలు చెప్పి తప్పును కప్పిపుచ్చుకుంటారా? అనే విమర్శలు వస్తున్నాయి. విద్యుత్ వైర్లు ఉడత కొరికేంత బలహీనంగా ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? చేతికి అందేంత ఎత్తులో హైటెన్షన్ వైర్లు ఉంటే అధికారుల కళ్లకు అవి కనిపించటంలేదా? అని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటంతో, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. గుండంపల్లికి చెందిన మహిళలు వ్యవసాయ పనుల కోసం ఆటోలో చిల్లకొండపల్లి బయలుదేరారు. మార్గమధ్యలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. సామాన్లు పెట్టుకోవడానికి ఆటోపై ఇనుప స్టాండ్ ఏర్పాటు చేశారు.ఈ స్టాండుకు హై టెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో కరెంట్ షాక్ తగిలి, ఆటోకు నిప్పు అంటుకుంది. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.