చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండల పరిధిలోని పేరూరు గ్రామంలో ఇంటింటికి సిపిఎం, జనం కోసం సిపిఎం కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించామని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నాటి ఉదయం పేరూరులో సిపిఎం కార్యకర్తలు, పలువురు గ్రామ ప్రజల సహకారంతో ఇంటింటికి సిపిఎం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రజలు పెరిగిన ధరల పై తీవ్ర నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. పేరూరు గ్రామానికి హైవేతో రోడ్డును అనుసంధానం చేయకపోవడం, స్మశానం సమస్య, రోడ్లు సక్రమంగా లేకపోవడం, దీపాలు వెలగకపోవడం, కరెంటు సమస్యల గురించి ప్రస్తావించారని తెలిపారు. చెత్త పన్నుపేరుతో నెలకు యాభై రూపాయల చొప్పున బలవంతంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
పేరూరు గ్రామ ప్రజల్లో అత్యధికులు టిటిడి, యూనివర్సిటీ తదితర ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పనులు చేస్తున్నారని వీరికి ప్రభుత్వం వేతనాల కోత పెట్టిందని, అటవీ కార్మికులకు 39 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని అటవీ కార్మికులు తెలిపినట్టు మురళి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కరెంటు చార్జీలు, నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ వంటి ధరలు పెరిగిపోవడంతో తమ ఖర్చులు విపరీతంగా పెరిగాయని, ఆ మేరకు ఆదాయం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు వివరించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రం లోని వైసీపీలు ఎన్నికల ముందు చెప్పిన దానికి ఆచరణలో సాగిస్తున్న దానికి సంబంధమే లేదని తీవ్రమైన భాధలతో అల్లాడిపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. జనం కోసం సిపిఎం పేరుతో సాగిస్తున్న ఈ ప్రచార కార్యక్రమం జూన్ నెల అంతటా సాగుతుందని జూలై 11న చలో కలెక్టరేట్ తో ముగుస్తుందని కందారపు మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు మాధవ్, జి.బాలసుబ్రమణ్యం, పేరూరు సిపిఎం కార్యదర్శి ముని క్రిష్ణ పలువురు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.