ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ ధర్నా జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రజాపోరు ఆగదని నాయకులు హెచ్చరించారు. గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.50 పెంచింది. దీంతో, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1035 నుంచి 1085కు, విశాఖలో రూ.1055 నుంచి 1,105కు, కర్నూలులో రూ.1,053 నుంచి రూ.1,103కు ధర పెరిగింది. విజయవాడ లోని అన్సారీ పార్కు సెంటర్‌లో ఖాళీ గ్యాస్ బండలతో సిపిఎం ఆధ్వర్యాన జరిగింది. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ వంద రోజుల్లో ధరలు తగ్గిస్తానని మాయమాటలతో అధికారంలోకి వచ్చి మోడీ గత ఎనిమిదేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచారని తెలిపారు.
వంట గ్యాస్‌పై సబ్సిడీ పూర్తిగా ఎత్తివేశారన్నారు. దీంతో, గతంలో రూ.400 ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు రూ.1100 చేరుకుందని తెలిపారు. మోడీ ముద్దుబిడ్డలైన అంబానీలు, అదానీలకు రాయితీలు ఇస్తూ వారి ఖజానా నింపుతున్నారని, సామాన్యుల జేబులు ఖాళీ చేస్తున్నారని అన్నారు. గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ విశాఖలో సిఐటియు, ఐద్వా, ప్రజానాట్యమండలి మద్దిలపాలెం జోన్ కమిటీల ఆధ్వర్యాన పిఠాపురం కాలనీలో నిరసన తెలిపారు. ఐద్వా జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యాన పూర్ణామార్కెట్ దుర్గాలమ్మగుడి వద్ద కట్టెల పొయ్యలతో వంట చేసి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. గ్యాస్ ధర పెంపును వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. తక్షణం పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తేవాలని కోరారు.
పదే పదే వంట గ్యాస్ ధర పెంచడం శోచనీయం – తులసిరెడ్డి
పెంచిన వంట గ్యాస్ ధర వెంటనే తగ్గించాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్ చేశారు. వంట గ్యాస్ ధర తగ్గిస్తేనే రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపిjr మద్దతు ఇస్తామని, లేకుంటే వ్యతిరేకంగా ఓటు వేస్తామని వైసీపీ , టిడిపి పార్టీలు ప్రకటించాలని కోరారు. వంట గ్యాస్ ధర పెంపు కు నిరసనగా కడప జిల్లా వేంపల్లె లో గురువారం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ లు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదే పదే వంట గ్యాస్ ధర పెంచడం శోచనీయమని అన్నారు. గడిచిన మూడు నెలల్లో నాలుగు సార్లు పెంచిందన్నారు. కాంగ్రెస్ పాలనలో సిలిండర్ ధర రూ.410 ఉండగా, నేడు రూ.1100లు దాటిందని మండిపడ్డారు. గృహిణులు వంట గదిలోకి వెళ్ళాలంటే భయపడిపోతున్నారన్నారు. ‘‘ఒక వైపు అచ్చే దిన్ అంటూ, మరోకవైపు చచ్చే దిన్ చూపిస్తున్నారు ప్రధాని’’ అంటూ మండిపడ్డారు. పెంచిన వంట గ్యాస్ ధర వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. వంట గ్యాస్ ధర పెంపు పై జనసేన తన వైఖరిని స్పష్టం చేయాలని తులసిరెడ్డి తెలిపారు.