గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై నిర్వహించిన తాజా సమీక్షలో సీఎం జగన్ ఈసారికి వారసులొద్దంటూ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు.ఎన్నికల్లో వారసుల్ని బరిలోకి దించాలని చాలా మంది వైసీపీ నేతలు ఎమ్మెల్యేలు ముందు నుంచే ప్రణాళికలు వేసుకున్నారు. కానీ, వచ్చే ఎన్నికల్ని జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొత్త ముఖాలను బరిలోకి దింపి ప్రయోగాలు చేస్తే ఇబ్బందికర పరిస్థితులకు దారితీయొచ్చని వైకాపా నేతలు విశ్లేషిస్తున్నారు. పార్టీ శ్రేణులతో ప్రత్యక్ష సంబంధాలున్న సిట్టింగులనే బరిలోకి దించడం సమంజసంగా ఉంటుందని చెప్తున్నారు. వైకాపాకు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఐప్యాక్ సంస్థతోపాటు ఒకట్రెండు ఇతర సంస్థల ద్వారా చేయించిన సర్వేల ఆధారంగానే జగన్ ఈ నిర్ణయానికి వచ్చారు.
ఇప్పటికే అనేక మంది నాయకుల వారసులు క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు నడిపిస్తున్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ కుమారుడు డాక్టర్ కృష్ణ చైతన్య, స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి వెంకటనాగ్,మంత్రి వేణుగోపాలకృష్ణ కుమారుడు నరేన్, ఎంపీ బోస్ కుమారుడు సూర్యప్రకాష్ చురుగ్గా తిరుగుతున్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి, యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు కుమారుడు సుకుమార్ వర్మ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి వారి నియోజకవర్గ రాజకీయాల్లో వారు చురుగ్గా పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కుమారుడు పృథ్వీరాజ్ మండపేట, రామచంద్రాపురం నియోజకవర్గాల పరిధిలోని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి మొదట్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించారు.ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇటీవలే ప్రకటించారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్‌రెడ్డి పల్లెబాట పేరుతో నియోజకవర్గ పరిధిలో ఆరు నెలల క్రితం విస్తృతంగా తిరిగారు. ఇంటి దగ్గర ప్రజాదర్బార్ నిర్వహించి వినతులు స్వీకరించిన సందర్భాలున్నాయి. ఇక శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కుమారుడు తండ్రితో సంబంధం లేకుండానే సొంతంగానే నియోజకవర్గంలో తిరుగుతున్నారు.
సర్వేల్లో వారసుల కంటే తండ్రుల పోటీపైనే ప్రజల నుంచి ఎంతో కొంత సానుకూలత వచ్చింది. వారసుల గ్రాఫ్ ఏ మాత్రం బాగాలేదని, వాళ్లకు టికెట్లు ఇస్తే కచ్చితంగా ఓడిపోతారని సర్వేల్లో వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు వారసులు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోగా మరికొందరికి ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలతో అసలు సంబంధాలు లేకపోవడం సమస్యగా మారింది.