గత ప్రభుత్వం అంబేడ్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి పేరుతో అమలు చేసిన పథకాన్ని వైసీపీ ప్రభుత్వం పేరు మార్చి జగనన్న విదేశీ విద్యాదీవెన అంటూ మళ్లీ అమల్లోకి తేనుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు విద్యానిధి పథకం ద్వారా సాయం చేసింది. ఈ పథకం కింద విదేశాల్లో పేరున్నయూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థులకు ఏడాదికి రూ.20 లక్షలు సాయం అందించేంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకానికి మంగళంపాడింది. దీంతో అప్పటికే ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయంతో విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. పలు ఆందోళనల నేపథ్యంలో మూడేళ్ల అనంతరం పథకం పేరు మార్చి అమలుచేసేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది.
సీఎం జగన్మోహన్‌రెడ్డి పేరుతో అమలు చేయబోతోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. విదేశాల్లోని 200 యూనివర్సిటీల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ సీటు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించనుంది. క్యూఎస్ ర్యాంకింగ్‌ల్లో మొదటి 100లోపు ఉన్న వర్శిటీల్లో సీటు సాధించిన విద్యార్థులకు మొత్తం ఖర్చు నాలుగు విడతలుగా ప్రభుత్వం విడుదల చేయనుంది. 101 నుంచి 200 వరకు ర్యాంకింగ్స్ ఉన్న వర్సిటీల్లో సీటు సాధించిన వారికి గరిష్ఠంగా రూ.50లక్షలు కోర్సు పూర్తయ్యే వరకు అందజేయనున్నారు. కుటుంబ ఆదాయం రూ.8లక్షలలోపు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో స్థానికుడై ఉండాలి. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం కింద లబ్ధి చేకూర్చుతారు. 35ఏళ్లలోపు వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులు. ఏటా రెండుసార్లు నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థుల ఎంపిక చేసి ఈ పథకం కింద లబ్ధి అందజేస్తారు.
సీఎం జగన్ పై మండిపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు
విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ అహంకారమే అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో “అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం” కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం చేశామని తెలిపారు. ‘‘ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ” పథకం కింద బీసీ, మైనారిటీ విధ్యార్థులకైతే రూ.15 లక్షలు, ఈబీసీ, కాపు విద్యార్థులైతే రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామని గుర్తుచేశారు. ఐదేళ్ల తెలుగుదేశం హయాంలో మొత్తం 4528 మంది విద్యార్థులు విదేశీ విద్యకు రూ.377.7 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగిందన్నారు.
మూడేళ్లపాటు ఈ పథకాలను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు “అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం” పేరు నుంచి అంబేద్కర్ పేరును తొలగించి జగన్ తన పేరు చేర్చడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరును తొలగించడం ఆయనను అవమానించడమే అని అన్నారు. ఇది జగన్ అహంకారమే అంబేద్కర్‌ను దైవంగా భావించే వారందరినీ కూడా అవమానించినట్టే అని తెలిపారు. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.