మునిసిపల్ స్కూళ్లకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్, అకడమిక్ వ్యవహారాలను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తేనున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టెన్త్ పరీక్షా ఫలితాల విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ 2,095 మునిసిపల్ స్కూళ్ల పర్యవేక్షణను పాఠశాల విద్యాశాఖకు కేటాయించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, టీచర్ల సంఘాల ప్రతినిధులు గతంలో తాను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కోరారని గుర్తు చేశారు..
ఈ స్కూళ్లు ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలో ఉన్నందున విద్యా వ్యవహారాలు, పాలనాపరమైన అంశాలపై విద్యాశాఖ సూచనలను అనుసరించి ముందుకు వెళ్లడంలో సమన్వయ లోపం ఏర్పడుతోందని వారు తన దృష్టికి తెచ్చారన్నారు. ఇటీవల ఈ అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఒకే విభాగం పర్యవేక్షణలో అన్ని స్కూళ్లు ఉండడమే మంచిదని భావించి అందుకు ఆమోదం తెలిపారన్నారు. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వెలువడనున్నట్లు చెప్పారు.
ఆస్తులన్నీ పురపాలక సంస్థల పరిధిలోనే
మున్సిపల్ స్కూళ్లకు సంబంధించిన ఆస్తులన్నీ పురపాలక సంస్థల పరిధిలోనే ఉంటాయని, కేవలం అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను మాత్రమే విద్యాశాఖ పర్యవేక్షిస్తుందని మంత్రి బొత్స స్పష్టం చేశారు. పాఠశాల విద్యాశాఖలో ఇంటర్మీడియెట్ బోర్డు విలీనంపై మంత్రి స్పందిస్తూ దీనిపై జాతీయ నూతన విద్యావిధానాన్ని అనుసరించి ముందుకు వెళ్తామని చెప్పారు.
ప్రైవేట్ స్కూళ్లలో ఎల్‌కేజీ, యూకేజీ మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఫౌండేషన్ విద్యను బలోపేతం చేసే దిశగా కొత్త విధానంపై చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. దీనిపై పాఠశాలల మ్యాపింగ్, తరగతుల మెర్జింగ్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. శాటిలైట్ స్కూల్స్ (ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2), ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు), ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1–5 తరగతులు), ప్రీ హైస్కూల్స్ (3 నుంచి 7 లేదా 8వ తరగతి), హైస్కూల్స్ (3 నుంచి 10 తరగతి), హైస్కూల్ ప్లస్ (3 నుంచి 12వ తరగతి) విధానంలో ఉండేలా కసరత్తు చేస్తున్నామన్నారు.
నాడు – నేడు ద్వారా స్కూళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే కాకుండా బోధనా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు తగినంత మంది టీచర్లను నియమించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు.
మున్సిపల్ పాఠశాలల విలీనానికి రంగం సిద్ధం !
విద్యాశాఖలో పురపాలక పాఠశాలల విలీనానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పాఠశాలలతో పాటు ఆస్తుల బదిలీకి సంబంధించి పురపాలక కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానాలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే.. ఎప్పుడో దాతలిచ్చిన పురపాలక పాఠశాలల ఆస్తుల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 59 పురపాలక, నగరపాలక సంస్థల ఆధ్వర్యంలో 2వేల 115 పురపాలక పాఠశాలు ఉన్నాయి. వీటిలో నాలుగున్నర లక్షల మంది చదువుతున్నారు. పురపాలక పాఠశాలు అంటేనే నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు భరోసా అందించే విద్యాకేంద్రాలు. తాజాగా ఈ పాఠశాలను విద్యాశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన్నట్లు సమాచారం. విలీన ప్రక్రియలో భాగంగా పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు తీర్మానాలు చేయాలని నిర్దేశించింది. ప్రస్తుతం విద్యాశాఖ పరిధిలో ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ పాఠశాలలు కూడా విద్యాశాఖ పరిధిలోకి వస్తే వీటిని కూడా కుదించే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో చదువు దూరమయ్యే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
పురపాలక పాఠశాలలను ఒకప్పుడు దాతలిచ్చిన స్థలాల్లో నిర్మించారు. ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఈ స్థలాల పరిరక్షణ సాధ్యమవుతుందా అన్న అనుమానాలున్నాయి. తల్లిదండ్రుల కమిటీల ఆమోదం లేకుండానే కౌన్సిల్లో తీర్మానాల ద్వారా విలీనం చేయడం ఏ మేరకు సబబనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో జడ్పీ పాఠశాలల విలీనం సమయంలో ఆస్తుల జోలికి పోకుండా కేవలం విద్యాపర్యవేక్షణ వరకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఆస్తుల బదలాయింపు చేయడం వెనుక ఉద్దేశ్యమేంటని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
పురపాలక పాఠశాలలు విద్యాశాఖలో విలీనమైతే ఉపాధ్యాయుల సర్వీసు సైతం విద్యాశాఖలో విలీనమవుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు వివాదం ఎన్నో ఏళ్లుగా వివాదంలో ఉంది. తాజాగా మున్సిపల్ పాఠశాలలను సైతం విలీనం చేయడం వల్ల గందరగోళం మరింత పెరిగే అవకాశముంది. నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందిస్తున్న పురపాలక, నగరపాలక పాఠశాలలు, ఆస్తుల విలీనం నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
పేరుకే విలీనం.. టార్గెట్ ఆస్తులే
పురపాలకశాఖ యాజమాన్యంలో ఉన్న పాఠశాలలన్నీ విద్యాశాఖలో విలీనంచేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా ఉపాధ్యాయులంతా విద్యాశాఖ కిందకే వస్తారు. రాష్ట్రంలో మొత్తం 59 పురపాలక, నగరపాలక సంస్థల ఆధ్వర్యంలో మున్సిపల్ పాఠశాలలు నడుస్తున్నాయి. వాటన్నింటినీ విద్యాశాఖలో విలీనం చేయనున్నారు. ఆ మేరకు ఆయా పురపాలక సంఘాలు, నగరపాలక సంఘాలు తీర్మానాలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా! అన్నట్లుగా ఆ కార్యక్రమం త్వరలోనే పూర్తికానుంది. అయితే ఈ విలీనం వెనక అసలు లక్ష్యం ఆస్తులేనని అంటున్నారు. ఒక్కో నగరం, ఒక్కో పట్టణంలో పదుల సంఖ్యలో మున్సిపల్ పాఠశాలలున్నాయి. అవి మంచి క్రీడామైదానాలు, విశాలమైన ప్రదేశాల్లో ఉన్నాయి. కొన్ని పాఠశాలలు పదుల ఎకరాల్లో ఉన్నాయి. ఉదాహరణకు విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో ఉన్న పీఎ్‌సఆర్‌ఎం పాఠశాల నుంచి బాపట్ల లాంటి చిన్న పట్టణంలో ఉన్న మున్సిపల్ హైస్కూలు వరకు విశాలమైన విస్తీర్ణంలో ఉన్నాయి. గుంటూరు, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, కర్నూలు, అనంతపురం, కడప….ఇలా ప్రతి నగరం,పలు పట్టణాల్లో ఉన్న మున్సిపల్ పాఠశాలల భూములు ఇప్పుడు అత్యంత ఖరీదైనవిగా మారాయి. ఇలాంటి మున్సిపల్ పాఠశాలలను విద్యాశాఖలో విలీనం చేసింది. ఆయా ఖరీదైన భూములను ఇతర ఉపయోగాల కోసం ఇచ్చి ఖజానాకు నిధులు సమకూర్చడం కోసమే అన్న ఆందోళన వ్యక్తమైంది. విద్యాశాఖలో విలీనం చేయడం ద్వారా…ఈ పాఠశాలల కింద ఉన్న భూములను క్రమంగా దారిమళ్లిస్తారని విమర్శలు వస్తోన్నాయి…. దాతలిచ్చిన భూములు, ప్రభుత్వ స్థలాల్లో నెలకొల్పిన మున్సిపల్ పాఠశాలలవి. ఈ భూములు ఇప్పుడు కోట్లు పలుకుతున్నాయి. దీంతో విద్యావసరాలకే వాడాల్సిన సూళ్ల ఆస్తులు వేలానికి పెట్టే ఎత్తు వేశారు. అందులో భాగంగానే ఈ స్కూళ్లను విద్యాశాఖలో ఆస్తుల విలీనం నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించాలని ఉపాధ్యాయులు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు…