సర్ ఆర్థర్ కాటన్ కరువు’కు శాశ్వత పరిష్కారంగా ఉభయ గోదావరి జిల్లాలకు ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం తలపెట్టినదే, యావదాంధ్రలోని బీడువారుతున్న పొలాలకు, పండించడానికి గోదావరి పైన ఒక పెద్ద నీటిపారుదల ప్రాజెక్టును ఊహించి ఆలోచన చేసిన తొలి వ్యక్తి భారత సుప్రసిద్ధ సివిల్ అధికారి శొంఠి వెంకట రమణమూర్తి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ముందు దేశ స్వాతంత్య్రానికి ముందు 1941 జూలై నాటికే ఈ ప్రాజెక్టును తలపోసి కార్యాచరణకు దిగిన మహామేధావి. గోదావరి, కృష్ణా నదుల నీటిలో 7 శాతం మాత్రమే ఉపయోగపడుతున్నందున మిగతా జలసంపద సముద్రం పాలవడానికి వీలులేదని భావించినవాడాయన! పోలవరం దగ్గర్లో పాపికొండల వద్ద గండికి దిగువన గోదావరిపై డ్యామ్ నిర్మించడం సబబని ఆయన భావించి ఆనాడు చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న ఎల్. వెంకట కృష్ణయ్యర్‌ను కూడా ఆ ప్రాంతానికి వెళ్లిరమ్మని పురమాయించాడు. అక్కడికి వెళ్లొచ్చి డ్యామ్ నిర్మాణం సాధ్యమేమని ఇంజనీర్ నివేదిక ఇచ్చాడు.
రామపాద సాగర్ ప్రాజెక్టు
గోదావరి డ్యామ్ అగ్రభాగం భద్రాచల రామాలయానికి అడుగుభాగమై ఉండాలని, అక్కడ తీరం వద్ద పేరుకొనే నిలవనీరై (బ్యాక్‌వాటర్) ఉండాలని శొంఠి చెప్పారు! ఈ ప్రాజెక్టుకే ‘రామపాద సాగర్ ప్రాజెక్టు’ అని ఆనాడు పేరుపెట్టడానికి కారణం. ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వెళ్లి భద్రాచలం రాములవారి గుడి దాకా వెళ్లే అవకాశం ఉంది కనుక ఆ పేరు పెట్టారు! . ఇది అఖిల భార తావని పథకం. ఈ ప్రాజెక్టు (రామపాద సాగర్ / పోలవరం) ఖండాం తరాలలోని ఇంజనీర్ల దృష్టిని కూడా ఆకర్షించింది. ఇటువంటి నిర్మా ణంలో ప్రపంచ మొత్తం మీదనే రెండవస్థానం ఆక్రమించబోయే ఈ భగీరథ ప్రయత్నం …
ఇలా ప్రారంభం-రామపాదసాగర్
పోలవరం ప్రాజెక్ట్ ఆలోచనకు పునాది కొన్ని దశాబ్దాల కిందట పడింది.1941లో నాటి నీటిపారుదల ముఖ్య ఇంజినీరు ఎల్.వెంకటకృష్ణ అయ్యర్, పోలవరం సమీపంలో గోదావరిపై రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను క్షుణ్నంగా పరిశీలించాక ఒక నివేదికను రూపొందించారు. ఈ ప్రాజెక్ట్‌కు రామపాదసాగర్ అని పేరు పెట్టారు. దీని అంచనా వ్యయం రూ.129 కోట్లు. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల అవసరాలకు నీటి తరలింపు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలను తీర్చడం. విజయవాడ నుంచి గుండ్లకమ్మ నది వరకు మరో 143 కిలోమీటర్ల కాలువ నిర్మించడం దీని ప్రధాన లక్ష్యాలు.
1953 వరదలు
1953లో గోదావరికి వరదలు వచ్చాయి. ఎంతో నీరు వృథాగా సముద్రంలోకి పోయింది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంటుకు నీటి అవసరాలు అంతకంతకూ పెరిగాయి. దీంతో గోదావరిపై రిజర్వాయర్ కట్టాలన్న ప్రతిపాదనకు మళ్లీ కదలిక వచ్చింది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాలతో కొన్ని ఒప్పందాలు జరిగాయి.
1981లో నాటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. అనేక రకాల పరిశీలనల తర్వాత 1986లో తుది నివేదికను రూపొందించారు. 1985-86 ధరల ప్రకారం నాడు ఈ ప్రాజెక్టు వ్యయం రూ.2,665 కోట్లుగా అంచనా వేశారు. ఆ తరువాత మరుగున పడిన ఈ ప్రాజెక్టులో తిరిగి 2004లో కదలిక వచ్చింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దీని నిర్మాణాన్ని ప్రారంభించారు.
పోలవరం మౌలిక స్వరూపం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా మూడు భాగాలున్నాయి. 1. రిజర్వాయర్, 2. స్పిల్‌వే, 3. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం
రిజర్వాయర్ : ఇందులో నీటిని నిల్వ చేస్తారు.
స్పిల్‌వే : రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు స్పిల్‌వే ఉపయోగడుతుంది. రెండు కొండల నడుమ దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 48 గేట్లు ఏర్పాటు చేయనున్నారు.
కాలువలు : రిజర్వాయర్‌కు రెండు కాలువలు ఉంటాయి. ఒకటి కుడి వైపు. రెండోది ఎడమ వైపు. వీటి ద్వారా నీటిని తరలిస్తారు.
ఆనకట్ట : ఇది రిజర్వాయర్ ఆనకట్ట. ఇందులో అనేక భాగాలున్నాయి.
డయాఫ్రం వాల్ : నది మధ్యలో దాదాపు 300 అడుగుల లోతులో కడుతున్న కాంక్రీటు గోడ. నీరు లీకేజీ కాకుండా ఇది కాపాడుతుంది. దీని పొడవు 2.454 కిలోమీటర్లు.
రాతి, మట్టి కట్టడం, డయాఫ్రం వాల్‌కు ఇరువైపులా రాతి, మట్టి కట్డడం (ఎర్త్-కం-రాక్ ఫిల్ డ్యాం) నిర్మిస్తారు.
కాఫర్ డ్యాం: ప్రధాన డ్యాంను నిర్మించేటప్పుడు నీరు అడ్డు తగలకుండా ఉండేందుకు తాత్కాలికంగా నిర్మించే కట్టడాన్ని కాఫర్ డ్యాం అంటారు.
పోలవరం విషయంలో రెండు కాఫర్ డ్యామ్‌లు ప్రతిపాదించారు. నది ప్రవాహం అడ్డుతగలకుండా ఎగువన ఒకటి, ధవళేశ్వరం బ్యారేజీ బ్యాక్ వాటర్ అవరోధం కలిగించకుండా దిగువున ఒక డ్యాం నిర్మించాలని నిర్ణయించారు
ప్రస్తుతం ఇలా..
రామపాదసాగర్ నిర్మించాలని ప్రతిపాదించిన ప్రాంతానికి 2 కిలోమీటర్ల ఎగువున పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. 2,454 మీటర్ల పొడవైన ఎర్త్-కమ్-రాక్ ఫిల్ డ్యాం, 1,128 మీటర్ల పొడవైన స్పిల్ వేను నిర్మించేందుకు నిర్ణయించారు.
ఎడమ కాలువ: 181.50 కిలోమీటర్ల పొడవు. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని చెబుతున్నారు. అలాగే విశాఖపట్నం నగరానికి తాగు నీరు ఇవ్వనున్నారు. ఈ కాలువను జలరవాణాకు కూడా ఉపయోగించనున్నారు.
కుడి కాలువ: 174 కిలోమీటర్ల పొడవు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. అలాగే 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించనున్నారు.
జలవిద్యుత్: 960 మెగావాట్ల సామర్థ్యం గల జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్నారు.
విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. విశాఖపట్నంలో కర్మాగారాల నీటి అవసరాలను తీర్చనున్నారు. విశాఖపట్నం నగరానికి తాగు నీరు అందించనున్నారు. కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత తగ్గుతున్నందున బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా పోలవరం ఉపయోగపడుతుంది.
నిధులు-వ్యయం
2017 ఆగస్టులో పోలవరానికి సంబంధించి కొత్త అంచనాలను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించింది. 2013-14 ధరల ప్రకారం ప్రాజెక్ట్ బడ్జెట్ రూ.58,319 కోట్లకు చేరినట్లు కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సమర్పించిన కొత్త అంచనా వ్యయానికి సీడబ్ల్యూసీ ఆమోదం లభించాల్సి ఉంది. మొత్తం వ్యయంలో పునరావాసానికి రూ.32,000 కోట్లు అవుతాయని అంచనా.
పోలవరం అంచనా వ్యయం
1985- 86 ధరల సూచీ ప్రకారం రూ. 2665 కోట్లు
2005-06 ధరల సూచీ ప్రకారం రూ. 10 151 కోట్లు
2010, 11 ధరల సూచీ ప్రకారం రూ, 16010 కోట్లు
2013- 14 ధరల సూచీ ప్రకారం రూ. 58,319 కోట్లు
2017–18 ధరల సూచీ ప్రకారం రూ. 55,657 కోట్లు
టీఏసీ సూచనల మేరకు అంచనా వ్యయాన్ని రెండోసారి సవరించి రూ.55,548 కోట్లతో ప్రతిపాదనలను సమర్పించారు. ఆర్‌సీఈ ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం అంచనా వ్యయాన్ని రూ.47,725 కోట్లకు కుదించింది..
జాతీయ ప్రాజెక్ట్
పోలవరాన్ని 2014లో జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారు. 2017 జనవరి నాటికి పోలవరంపై రూ.8,898 కోట్లు ఖర్చు పెట్టారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత అంటే 2014 మార్చి నుంచి 2017 జనవరి వరకు ఖర్చు పెట్టిన నిధులు రూ.3,349.70 కోట్లు. 2014 మార్చి నుంచి 2017 జనవరి నాటికి పోలవరం అథారిటీ ద్వారా కేంద్రం ఇచ్చిన నిధులు రూ.2,916.54 కోట్లు. పోలవరం నిర్మాణానికి అయ్యే నిధులను నాబార్డు కేంద్రానికి రుణంగా ఇస్తుంది. వీటిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా ఖర్చు చేస్తున్నారు. 2014 జనవరి 1 నాటి అంచనాల ప్రకారమే ప్రాజెక్ట్ వ్యయాన్ని పూర్తిగా భరిస్తామని కేంద్రం తెలిపింది. అంటే ఈ అంచనాల కన్నా అదనంగా ఖర్చు అయితే దానిని రాష్ట్రమే భరించాలి.
ఎత్తిపోతల పథకాలు
పోలవరం భారీ ప్రాజెక్టు. ఇది పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా నీటిని తరలించేందుకు తాత్కాలిక ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల (లిఫ్ట్ ఇరిగేషన్) పథకాలు చేపట్టింది. ఈ ఎత్తిపోతల పథకాలు పోలవరం మౌలిక డిజైన్‌లో భాగం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీటిని రాష్ట్రమే తమ సొంత నిధులతో నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. పట్టిసీమ: పోలవరం మండలంలోని పట్టిసం వద్ద ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 2015లో దీని నిర్మాణం పూర్తయింది. 2015 డిసెంబరు నాటికి దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1299 కోట్లు ఖర్చు చేసింది.
పురుషోత్తమపట్నం: రూ.1,638 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టారు. 2017 ఆగస్టులో తొలి విడత పూర్తి అయింది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఏలేరు జలాశయానికి తరలిస్తారు.
2013 నాటి భూ సేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోలేదు. అంతే కాకుండా, అప్పటివరకూ ఇరిగేషన్ కాంపొనెంట్ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించారు. దీనివల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారమంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతోంది.
“ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్–90లో పేర్కొన్న స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం. భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ రూపేణా సవరించిన అంచనాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఆమోదం తెలిపిన నేపథ్యంలో, ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు తిరస్కరించడం ప్రాజెక్టుకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది” అంటూ ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
డయా ఫ్రమ్ వాల్ లోపమే జాప్యానికి కారణం
“ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామనే అనుకున్నాం. కానీ అది జరగలేదు. దానికి కారణాలున్నాయి. డయా ఫ్రమ్ వాల్ నిర్మాణ లోపాలు అందుకు ఆటంకం. హడావిడిగా నీటిని మళ్లించాలనే తొందరలో గత ప్రభుత్వం చేసిన తప్పిదానికి ఫలితమే నిర్మాణంలో జాప్యానికి అసలు కారణాలు. అయినా మా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కేంద్రం సహకరించాలి. అంచనాలు సవరించాలి. ఏపీలో అధికార, విపక్షాల వాదనలు ఎలా ఉన్నా, ప్రస్తుతం ఆర్థికంగా అవస్థల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం పూర్తి చేయాలంటే కేంద్రమే ఉదారంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంచనాలు సవరించడం, ఆర్ అండ్ ఆర్‌కి అవసరమైన మేరకు నిధులు కేటాయించడం సహా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే పోలవరం కల నెరవేరే అవకాశం ఉంది. లేదంటే నిర్మాణం మరింత జాప్యం అవుతుంది. దానివల్ల అంచనా వ్యయం ఇంకా పెరిగే అవకాశం ఉంది.
కేంద్రం నుంచి రాష్ట్రానికి పోలవరం బాధ్యత
జాతీయ ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారం మొత్తం వ్యయం కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. కానీ, 2016 సెప్టెంబర్‌లో నాటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. 30-9-2016న కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన F.NO.1(2)PF-1/2014(PT) ప్రకారం నీతి అయోగ్ సిఫారసు మేరకు పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి బదిలీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్రమే ప్రాజెక్ట్ నిర్మిస్తుందని ప్రకటించారు. 1.1.2014 నాటికి ఇరిగేషన్ వాటా మొత్తం కేంద్రం అందిస్తుంది. నాటి రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకే తాము ఈ సిఫారసు చేసినట్టు నీతి అయోగ్ అప్పట్లో ప్రకటించింది. అప్పటి కేంద్ర ప్రకటన ప్రకారం 2013-14 నాటి అంచనాల ప్రకారం కేంద్రం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం మాత్రమే భరిస్తుంది. పైగా కేంద్రం నేరుగా ఇవ్వాల్సిన నిధులను నాబార్డ్ ద్వారా అందించేందుకు అంగీకరించారు. అంతేగాకుండా 2017 మార్చిలో క్యాబినెట్ తీర్మానం ప్రకారం 2014 తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం పెరిగితే, కేంద్రానికి బాధ్యత లేదని కూడా తీర్మానించారు. పైగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో కూడా 2013 ముందు నాటి లెక్కలనే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో, కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం నిర్మాణ బాధ్యత అప్పగించారు.
కాంట్రాక్టుల కోసమేనా…. పోలవరం బాధ్యత
“కేవలం కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్ల కోసమే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టుంది. ఈ అంగీకారం చేసుకోవడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. కుడి, ఎడమ కాలువలు 80% నిర్మించడంతోపాటూ కొంత భూసేకరణకు కూడా కేటాయించారు. అయితే, అప్పటికే చేసిన రూ.5 వేల కోట్ల రూపాయలను తాము ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రతిపాదించగా, అప్పటి ప్రభుత్వం అంగీకరించింది. “ఇంకా ప్రమాదకరమైన నిబంధన ఏమిటంటే, 2018 మార్చి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని, పూర్తి చేయలేని పక్షంలో ప్రాజెక్టు నిమిత్తం కేంద్రం నుంచి వస్తున్న నిధులను గ్రాంట్‌గా కాకుండా లోన్‌గా మార్చేందుకు కూడా అంగీకరించారు. ఇది రాష్ట్రానికి అత్యంత భారంగా మారే ప్రమాదం ఉన్నా ఖాతరు చేయలేదు. దానికి కనపడుతున్న కారణం ఒక్కటే.. కాంట్రాక్టులు తమకు నచ్చిన వారికి ఇచ్చుకోవచ్చనేష నిర్ణయం…
పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకూ వచ్చింది..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను 2013లో ట్రాన్స్ ట్రాయ్ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత సకాలంలో పనులు చేపట్టలేదని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. చివరకు 2017లో పలు సబ్ కాంట్రాక్టర్లకు పనులు పూర్తి చేసే బాధ్యత అప్పగించారు. ఇక ఏపీలో అధికార మార్పిడి తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. పోలవరం నిర్మాణం నుంచి నవయుగ లాంటి కంపెనీలను తప్పించింది. రివర్స్ టెండరింగ్ లో మేఘా కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం మేఘా ఆధ్వర్యంలో స్పిల్ వే పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 20న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం ప్రస్తుతం సెప్టెంబర్ 26 నాటికి మొత్తం పోలవరం ప్రాజెక్టు 41.05 శాతం పూర్తయ్యింది. అందులో నిర్మాణ పనులు 71.54 శాతం పూర్తయ్యాయి. కానీ భూసేకరణ, పునరావాసం మాత్రం 19.85 శాతం మాత్రమే పూర్తయ్యాయి. నిర్మాణ పనుల్లో కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో ఎక్కువ భాగం 2014 నాటికే పూర్తి చేశారు. ప్రస్తుతం స్పిల్ వే నిర్మాణం జరుగుతోంది. స్పిల్ చానెల్ పనులు కూడా చేస్తున్నారు. ఇక కాఫర్ డ్యామ్ నిర్మాణం కూడా దాదాపుగా 2018 నాటికే జరిగింది. మెయిన్ డ్యామ్ పనులు మాత్రం నామమాత్రంగా జరిగాయి. పవర్ ప్రాజెక్ట్ కోసం భూమిని సిద్ధం చేసే దశలో ఉంది. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ అమలు విషయానికి వస్తే, కేవలం ప్రాజెక్ట్ నిర్మిత ప్రాంతంలో అటు తూర్పు, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 14 గ్రామాల వరకూ పూర్తి చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.
అధికారిక లెక్కల ప్రకారం పూర్తయిన పోలవరం పనులు ఇలా ఉన్నాయి.
ఎర్త్ వర్క్స్ : 88శాతం
ఎం బ్యాక్‌మెంట్ : 34 శాతం
కాంక్రీట్ పనులు : 81శాతం
గేట్లు: 72.12శాతం
ఎడమ కాలువ ఎర్త్ వర్క్స్: 91.69శాతం
ఎడమ కాలువ స్ట్రక్చర్ : 62.78 శాతం
కుడికాలువ ఎర్త్ వర్క్స్: 100 శాతం
కుడికాలువ స్ట్రక్చర్: 94.84 శాతం
భూసేకరణ: 67.26 శాతం
పునరావాసం, పరిహారం విషయంలో నేటికీ పదిశాతం వరకూ మాత్రమే పూర్తయింది. పెద్ద మొత్తంలో దానికే ఖర్చు చేయాల్సి ఉంది. కీలకమైన ఈసీఎఫ్ఆర్ సహా ఇతర పనులు ఎప్పటికి పూర్తవుతాయి? ఆలస్యం ఎందుకు అవుతున్నాయన్నది చాలామందిని ఆందోళనకు గురిచేస్తున్న అంశం.