బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఏపీలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన ఇవాళ రెండో రోజు పర్యటనలో భాగంగా ముందుగా ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ థియోధర్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు, ఇతర నేతలతో కలసి దుర్గమ్మ సన్నిధికి రాగా.. ఆలయ ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జేపీ నడ్డాకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటాన్ని జేపీ నడ్డాకు బహుకరించారు.
కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం అనంతరం జేపీ నడ్డా మాట్లాడుతూ.. బెజవాడకు వచ్చి కనకదుర్గమ్మను దర్శించుకోవాలన్న తన చిరకాల వాంఛ ఇవాళ నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నారు. దేశ ప్రజలందరూ సుభిక్షంగా.. సంతోషంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో బీజేపీ దేశాన్ని మరింత మంచిగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నానని తెలిపారు. భారతదేశానికి ప్రపంచ దేశాల్లో మరింత పేరు ప్రఖ్యాతులు వచ్చేలా ఆశీర్వదించాలని మొక్కుకున్నానని జేపీ నడ్డా వివరించారు.