సాగు కలిసి రాక ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఉద్దేశించిన జనసేన కౌలు రైతు భరోసా యాత్ర శనివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభమైంది. జనసేనాని పవన్ కల్యాణ్ శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం చేరుకుని నగరం నుంచే యాత్ర ప్రారంభించారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభమైన జనసేన కౌలు రైతు భరోసా యాత్ర
కౌలు రైతు శ్రీ పచ్చిమళ్ళ శంకరం కుటుంబానికి రూ. లక్ష ఆర్ధిక సాయం అందించిన జనసేనాని #JanaSenaRythuBharosaYatra pic.twitter.com/IZ0mjNPJvk
— JanaSena Party (@JanaSenaParty) July 16, 2022
కౌలు రైతు భరోసా యాత్ర ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. ఉదయం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ అక్కడి నుంచి కోనసీమ జిల్లాకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతు పచ్చిమళ్ళ శంకరం కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. శంకరం ఫొటోకు నివాళి అర్పించిన పవన్… ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో ప్రకటించిన రూ.1 లక్షను ఆయన బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
అనంతరం మండపేటలో పవన్ కళ్యాణ్ రచ్చబండ నిర్వహిస్తున్నారు. చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలను కొన్ని నెలలుగా వరుసగా పరామర్శిస్తున్న పవన్ కళ్యాణ్.. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలే అని ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది. తమది రైతు ప్రభుత్వమని చెప్పుకుంటోంది. అయినా ఇప్పటికీ కౌలు రైతుల ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఆయా కుటుంబాలను వరుసగా పరామర్శిస్తున్నారు. పవన్ రాకతో ఆయా కుటుంబాల్లో ధీమా వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కూడా ఆయా కుటుంబాలకు సాయం ప్రకటించాలని పవన్ కోరుతున్నారు.