స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ రాష్ట్రం తాకట్టు పెట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికలకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న షరతు పెట్టీ ఉంటే ప్రత్యేక హోదా తప్పక వచ్చేదని, 25 ఎంపిలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా నన్నారని, 22 లోక్ సభ, 9 మంది రాజ్యసభ వెరసి మొత్తం 31 మంది ఎంపీలను ఇచ్చినా కేంద్రం ముందు సాగిలపడి ప్రత్యేక హోదా ప్రస్తావించలేదని ఆరోపించారు. మాట తప్పేవాడు నాయకుడే కాదని, మాట తప్పితే రాజీనామా చేయాలి అని జగన్ అన్నారని, ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పాడు కాబట్టి జగన్ రాజీనామా చేయాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.
వైయస్సార్ పెళ్ళి కానుక కింద ముస్లిం, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ చెల్లెమ్మలకు రూ.1 లక్ష, బీసీ చెల్లెమ్మలకు రూ.50 వేలు ఇస్తామని వైకాపా తన ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొందని, ప్రభుత్వం వద్ద డబ్బులు లేనందున అమలు చేయలేదని, హైకోర్టు కు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొనడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. సలహాదారులకు, పత్రిక ప్రకటనలకు డబ్బులు ఉంటాయి గానీ చెల్లెమ్మల పెళ్లి కానుకకు మాత్రం డబ్బులు వుండవా అని తులసిరెడ్డి ప్రశ్నించారు.
దుల్హన్ పథకమే కాకుండా అనేక అంశాలలో ముస్లిం మైనారిటీలకు జగన్ ప్రభుత్వం మోసం చేసిందని, దుకాన్ – మకాన్ పథకం రద్దు.. రంజాన్ తోఫా రద్దు… మసీదుల సుందరీకరణ పథకం రద్దు చేశారన్నారు. మైనారిటీ కార్పొరేషన్లకు నిధులు లేవని, అందువలన స్వయం ఉపాధి పథకాలు బంద్ అయ్యాయని చెప్పారు. సి ఏ ఏ కు మద్దతు పలకడం, శాసన మండలి మాజీ చైర్మన్ పై దుర్భాషలు, నంద్యాల లో అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య..ఇలా మాట తప్పిన నాయకుడు రాజీనామ చేయాలని జగనే అన్నారని, కాబట్టి మాట తప్పినందున జగన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని తులసిరెడ్డి పేర్కొన్నారు