సుబాబుల్ పంట కొనుగోళ్లలో రైతుల కులం, ప్రాంతం, పార్టీలు చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. వివక్ష లేకుండా రైతులందరి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమంచి పండించిన పంటను అమ్మి సొమ్ము చేసుకోవాలంటే అధికార పార్టీకి చెందిన వారికే విక్రయించాలనే చెత్త సంస్కృతి రాష్ట్రంలో రావడం దురదృష్టకరమని ఫైర్ అయ్యారు.
మూడున్నరేళ్లుగా గిట్టుబాటు ధరలేక సుబాబుల్ రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని తెలిపారు. గత కొద్ది రోజులుగా పరిశ్రమలు సుబాబుల్ కర్ర కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్న లోకేశ్ అయితే రైతులు తాము పండించిన పంటను మద్దతు ధరకు, తమకు నచ్చిన వారికి విక్రయించుకోవాలనుకున్న వారి ఆశలు అడియాశలు అవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలకు, లేదా వారి సూచించిన దళారులకే పంట అమ్మాలనే బెదిరింపులతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని విమర్శించారు.
అధికార పార్టీ నేతలకో, లేక వారు సూచించిన దళారులకే అమ్మాలని హుకుం జారీ చేయడం అన్నదాతల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. సుబాబుల్ పంట కొనుగోలు విషయంలో రాజకీయ జోక్యాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. రైతుల కులం, ప్రాంతం, పార్టీలు చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.(2/3)
— Lokesh Nara (@naralokesh) September 30, 2022
పోయిన ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటువేయని వారి పంటను కొనబోమని చెప్పడం దారుణమని ఇది సమంజసం కాదని నిలదీశారు. తమ పంటను విక్రయించేందుకు గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో రైతులు పడిగాపులు కాయడం పరిస్థితికి అద్దం పడుతుందని మండిపడ్డారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా విక్రయించుకునే హక్కు ఉందన్నారు. సుబాబుల్ పంట కొనుగోలు విషయంలో రాజకీయ జోక్యాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసుల బెదిరింపులను నియంత్రించి, కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
అసలే మద్దతు ధర లేక రైతులు నష్టపోతుండగా చేతికి వచ్చిన పంటను విక్రయించాలంటే అధికార పార్టీ నేతలకో, లేక వారి సూచించిన దళారులకే అమ్మాలని హుకుం జారీ చేయడం దారుణమన్నారు. ఒకవేళ అధికార పార్టీ సిఫార్సులతో దళారులకు విక్రయించినా ధరలో కోత పెడుతున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించి పంటను తరలించే లారీలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. అధికారమున్న దళారులకే పంట కొనే హక్కు ఉందంటూ పోలీసులు సైతం వారికి వంత పాడటం దుర్మార్గమని విమర్శించారు.