ఏలూరులో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్య నివారణకు పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్నవెంకటేష్ అధికారులను ఆదేశించారు. తొలుత ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అభ్యసించి ఎస్.ఎస్.సి లో జిల్లాలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థినిలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన ‘ జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం ‘పై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఏలూరు నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్య నివారణకు తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, కమిటీ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ చర్చించారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశంలో వాతావరణంలో వాయు నాణ్యతను పరిశీలించగా, 124 నగరాలలో వాయు కాలుష్యం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన వాయు కాలుష్యం కన్నా ఎక్కువ ఉన్న కాలుష్యం ఉన్న నగరాలను గుర్తించడం జరిగిందని, వాటిలో ఏలూరు నగరంను కూడా గుర్తించడం జరిగిందన్నారు. ఇందుకు నగరంలో అధిక సంఖ్యలో పెరిగిన ఆటోలు, ద్విచక్ర వాహనాలు కూడా ఒక కారణమన్నారు. ప్రజలందరికీ స్వచ్ఛమైన గాలిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం “జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమాన్ని” (నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం) అమలు చేసేందుకు నిర్ణయించిందని, ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరంలో వాయు కాలుష్య నియంత్రణ కార్యక్రమాలు చేపట్టేందుకు ఏలూరు నగరపాలక సంస్థకు ముందస్తుగా 1. 58 కోట్ల రూపాయలు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమాన్ని 2020 నుండి 2026 వ సంవత్సరం వరకు ఆరేళ్ళ పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. వాయు కాలుష్య స్థాయిని 20 నుండి 80 శాతం వరకు తగ్గించి, గాలిలో నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకోవలసి ఉంటుందన్నారు. కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ, కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు ఏలూరు నగరంలో వాయు కాలుష్యం పెరుగుటకు కారణాలు, నియంత్రణకు సంబంధించి తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
వాయు కాలుష్యాన్ని కలిగించే అధిక సంఖ్యలో ఉన్న ఆటోలు, ద్విచక్ర వాహనాలు డీజిల్ నుండి బాటరీ, సి.ఎన్.జి వాహనాలుగా మార్పు చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఏలూరు నగరంలో పెద్దఎత్తున పచ్చదనాన్ని అభివృద్ధి చేయడం, రోడ్లకు ఇరువైపులా, పార్కులలో మొక్కలు నాటడం, ప్రధాన కూడలి ప్రదేశాలలో వాటర్ ఫౌంటైన్స్ ఏర్పాటు చేయడం, హోటల్స్ వంటి వాటిల్లో కట్టెలు వంటి వినియోగంను నియంత్రించడం వంటివి చేపట్టాలన్నారు. వాయు కాలుష్యాన్ని ఎక్కువగా కలిగిస్తున్న వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేయాలన్నారు. రోడ్లకు రెండు వైపులా మట్టి కారణంగా దుమ్ము వాయు కాలుష్యం కలిగే అవకాశం ఉందని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో రోడ్లపై దుమ్ము శుభ్రం చేసేందుకు స్వీపింగ్ యంత్రాలను ఏర్పాటుచేసి, ప్రతీరోజు రోడ్లపై దుమ్ము లేకుండా శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
నగరంలో వాహనాల రద్దీ నివారించడానికి ఆర్టీసీ సిటీ బస్సు సర్వీసులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలల్లో గాలి నాణ్యతను తెలియజేసి యంత్రాలను ఏర్పాటుచేసి, ప్రజలకు కాలుష్య స్థాయి తెలియజేసేలా ఎల్.ఈ.డి.డిస్ ప్లే బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. వాహనాల కారణంగా రోడ్లపై దుమ్ము, ధూళీ ఎక్కువ లేకుండా చూసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాయు కాలుష్య నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కలిగించాలన్నారు. ఏలూరులో స్వచ్ఛమైన గాలి లక్ష్యంగా అధికారులందరూ కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కోరారు.