రాష్ట్రంలోని విద్యాసంస్థల కు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది… రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. కానీ రాష్ట్రంలో వర్షాలు ఏ మాత్రం తగ్గలేదు. అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గురు, శుక్ర, శనివారాల్లో కూడా విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. మరో వైపు రేపటి నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విస్తారంగా వర్షాలు కురవడంతో రేపు, ఎల్లుండి జరగాల్సిన అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా వేసినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇంజనీరింగ్ పరీక్షలు మాత్రం యథాతథం జరుగుతాయని పేర్కొంది.
రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కుంభవృష్టిగా వర్షం కురుస్తోంది. మరో రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అసిఫాబాద్, నిర్మల్, మహబూబ్ బాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఏడు రోజులుగా కురుస్తున్న వర్ఘాలతో తెలంగాణలో ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లు నిండటంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమలయ్యాయి. పలు ప్రాంతాల్లో రవాణా నిలిచిపోయింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరద బీభత్సం దారుణంగా ఉంది. ఇంకా వర్షాలు వస్తూనే ఉన్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో విద్యాసంస్థలను నడపడం సరికాదని విద్యాశాఖ అధికారులు భావించారు. ఐఎండీ వర్ష హెచ్చరికతో గురువారం, శుక్రవారం జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.