ఛాతీలో నొప్పి కారణంగానే విక్రమ్ ఆస్పత్రికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. నిపుణలైన వైద్యులతో చికిత్స అందించినట్లు ఆస్పత్రి యాజామాన్యం పేర్కొంది. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, రోజంతా వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, డిశ్చార్జ్ చేయనున్నట్లు ప్రకటించారు.. ఇదిలా ఉంటే విక్రమ్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై విక్రమ్ తనయుడు ధృవ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. దీనికి సంబంధించిన పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. విక్రమ్‌కు గుండెపోటు వచ్చిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపాడు. ఈ పోస్ట్‌లో ‘ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులరా, నాన్నకు ఛాతీలో కొద్దిపాటి నొప్పికారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు రాలేదు. ఈ పుకార్లు విని మేము చాలా బాధపడ్డాం. ఈ సమయంలో మా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం. ‘ అని పేర్కొన్నాడు.
ఇప్పటికే వివరణ ఇచ్చిన మేనేజర్
ప్రముఖ కథానాయకుడు విక్రమ్ ఛాతీలో అసౌకర్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. అయితే, విక్రమ్ కు గుండెపోటు అంటూ ప్రచారం జరిగింది. ఇప్పటికే దీనిపై ఆయన మేనేజర్ వివరణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో, చెన్నైలో విక్రమ్ కు చికిత్స అందిస్తున్న కావేరీ ఆసుపత్రి స్పందించింది. విక్రమ్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల చేసింది. ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో విక్రమ్ తమ ఆసుపత్రిలో చేరినట్టు వెల్లడించింది. విక్రమ్ ను నిపుణులైన తమ ఆసుపత్రి వైద్యుల బృందం పరీక్షించిందని, అవసరమైన వైద్యం అందించిందని తెలిపింది. విక్రమ్ కు కార్డియాక్ అరెస్ట్ లాంటి లక్షణాలేవీ లేవని, అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించింది. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని కావేరీ ఆసుపత్రి వారు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.