‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
రాష్ట్రానికి 1.42 కోట్ల జెండాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు
ఆగస్టు 1 నుంచి 15 వరకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పలు కార్యక్రమాలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ
రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను సీఎస్ సమీర్‌శర్మ ఆదేశించారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆగస్టు 1 నుంచి 15 వరకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పలు కార్యక్రమాలను రూపొందించినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ వివరించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా (ఇంటింటా మువ్వన్నెల జెండా) కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశించారు. సచివాలయం నుంచి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ‘‘రాష్ట్రానికి 1.42 కోట్ల జెండాల కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపాం. ఇందులో 40 లక్షల వరకు రాష్ట్రానికి అందనున్నాయి. మెప్మా 30 లక్షలు, సెర్ప్ ద్వారా మరో 10 లక్షల జెండాలు అందుబాటులోకి వస్తాయి. అటవీశాఖ 80 లక్షల జెండా కర్రలు అందిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు, లయన్స్, రోటరీ క్లబ్, ఇతర సంఘాల ద్వారా అవసరమైన జెండాలను సమకూర్చుకునేందుకు వీలుగా ఆయా సంఘాలు, సంస్థల సహకారాన్ని తీసుకుంటాం. విద్యా సంస్థలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను భాగస్వాములను చేయాలి. స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ సంఘాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, బార్ అసోసియేషన్లు, ఫిక్కీ, ఏపీఐఐసీ, పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థల ద్వారా జెండాలను సమకూర్చుకోవాలని పేర్కొన్నారు.
ప్రజల భాగస్వామ్యం కోసం
ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఆగస్టు 1 నుంచి 15 వరకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పలు కార్యక్రమాలను రూపొందించినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ సీఎస్ సమీర్ శర్మకు వివరించారు. ‘‘ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి విద్యా సంస్థలో ప్రభాత్ ఫెర్రీ (ఉదయపు నడక) నిర్వహిస్తాం. దేశభక్తి గీతాలను స్పీకర్ల ద్వారా వినిపించే ఏర్పాట్లు చేస్తున్నాం. స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహ ప్రాంగణాలు, ముఖ్యమైన ప్రాంతాలు, చారిత్రక కట్టడాలు, స్మారక చిహ్నాల దగ్గర ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వ వెబ్‌సైట్లు, టీవీలు, సినిమా థియేటర్లలో లఘు చిత్రాలు, హోర్డింగ్‌లు, బ్యానర్ల ఏర్పాటు, పత్రికల్లో ప్రత్యేక ప్రకటనలతో పాటు కథనాలు ప్రచురించేలా సమాచార శాఖ పర్యవేక్షిస్తుందని వివరించారు.
15 రోజులు..ప్రత్యేక కార్యక్రమాలు
ఆగస్టు 1న అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఇంటింటా మువ్వన్నెల జెండా కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు. 2న జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకల నిర్వహణ. 3న స్వాతంత్య్ర సమరయోధులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సదస్సులు. 4న పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు దేశభక్తి గేయాలపై పోటీలు. 5న విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో దేశభక్తిని ప్రబోధించే నాటికలు, ఏకపాత్రాభినయనాలు. 6న దేశభక్తిపై ప్రత్యేక ప్రదర్శనలు. 7న ఊరేగింపులు. 8న చిత్రలేఖనం, చర్చ, వక్తృత్వ పోటీలు. 9న దేశభక్తిపై సాంస్కృతిక కార్యక్రమాలు. 10న పోస్టర్ మేకింగ్ వంటి అంశాల నిర్వహణ. 11న హెరిటేజ్ వాక్. 12న క్రీడా పోటీలు. 13న జాతీయ జెండాతో సెల్ఫీ కార్యక్రమంతో పాటు విజయవాడలో చిన్నారులు, కళాకారులు, ప్రజలతో కలిపి 3 కి.మీల జాతీయ జెండా ప్రదర్శన. 14న స్వాతంత్య్ర సమరయోధుల ఇంటికి నడక, వారి కుటుంబ సభ్యులకు సన్మానం.15న జాతీయ జెండా ఆవిష్కరణ పాదయాత్రలు జరుగుతాయి.