జమ్మూ-కశ్మీరులో కురుస్తున్న భారీ వర్షాలు అమర్‌నాథ్ భక్తులకు అనేక ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. వర్షాలు, వరదల్లో చిక్కుకున్నవారిలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 40 మంది ఆచూకీ తెలియడం లేదు. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. వర్షాల్లో చిక్కుకున్నవారిని ఆదుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీనగర్‌లోని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం సాయంత్రం 6.40 గంటలకు కుండపోత వర్షం కురిసింది. ఆ తర్వాత కొండ చరియలు విరిగిపడ్డాయి, వరదలు సంభవించాయి. శనివారం మరింత తీవ్ర స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేశారు. గాయపడిన 11 మంది భక్తులను సైనిక హెలికాప్టర్లలో బల్తల్ బేస్ కేంప్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని జమ్మూ-కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పర్యవేక్షిస్తున్నారు.
గాయపడిన కొందరు భక్తులకు అమర్‌నాథ్ గుడి వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం అవసరమైతే శ్రీనగర్ ఆసుపత్రికి తరలిస్తామని ఓ వైద్యుడు చెప్పారు. ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ, పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని ఆసుపత్రులను సిద్ధం చేసినట్లు తెలిపారు. వైద్యులు, ఇతర సిబ్బంది సెలవులను రద్దు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఆరుగురు భక్తులను తరలించినట్లు తెలిపారు. నీలగ్రార్ హెలిపాడ్ వద్ద ఉన్న రోగులకు వైద్యులు చికిత్స చేస్తున్నారని పేర్కొన్నారు. కొండల్లో చిక్కుకున్నవారిని కాపాడే బృందాలు, ఆచూకీ తెలుసుకునే బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయన్నారు. సహాయక కార్యక్రమాలకు సంబంధించిన వీడియోను కూడా సైన్యం పోస్ట్ చేసింది. సైనిక జాగిలాలను, 10 సైనిక సహాయక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపింది.
ప్రత్యేక దళాల సిబ్బంది, సరిహద్దు భద్రతా దళం (BSF), జాతీయ విపత్తు స్పందన దళం (NDRF), సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో అవిశ్రాంతంగా పాల్గొంటున్నట్లు సైనికాధికారులు ప్రకటించారు. గాలింపు కొనసాగుతోందని, భక్తులను కాపాడగలుగుతామని ఆశిస్తున్నామని తెలిపారు. పరిస్థితి అదుపులో ఉందన్నారు. వరద ప్రవాహం నుంచి కొందరు సాధారణ పౌరులను కాపాడామని, వారికి ప్రథమ చికిత్స జరిగిందని, వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిపారు. తప్పిపోయినవారిని గుర్తించేందుకు జాగిలాలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. వరదల వల్ల డజన్లకొద్దీ గుడారాలు, సామూహిక భోజనశాలలు కొట్టుకుపోయాయి. 13 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర విపత్తు స్పందన దళం డైరెక్టర్ హసీబ్ ఉర్ రహమాన్ చెప్పారు. మృతుల్లో 11 మంది మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని చెప్పారు. ఇదిలావుండగా, జాతీయ మీడియా తాజా కథనాల ప్రకారం, ఈ వరదల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
అమర్‌నాథ్ యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు
అమర్‌నాథ్ యాత్రలోకుండపోత వాన, ఆకస్మాత్తుగా వరదలు వచ్చాయన్న సమాచారం నేపథ్యంలో రాష్ట్రం నుంచి వెళ్లిన పలువురి యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో సీఎంఓ అధికారులు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్‌తో మాట్లాడారు. అడిషనల్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న హిమాంశు కౌసిక్‌ను వెంటనే శ్రీనగర్‌కు పంపిస్తున్నారు. యాత్రికుల భద్రత, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన సమన్వయం చేసుకుంటారు. అవసరమైన చర్యలు తీసుకుంటారు.
కైకలూరు యాత్రికులు క్షేమం..
ఏలూరు జిల్లా కైకలూరు నుంచి యాత్రకు వెళ్లిన 10 మంది శుక్రవారం అక్కడ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్నారు. ప్రసార మాధ్యమాల్లో వరదల వార్తలను చూస్తున్న వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 1న కైకలూరు నుంచి బట్టు సీతారామయ్య, రెడ్డి, సింహాచలం, కోడూరు సుబ్బారావు, రాజు తదితరులు 10 మంది ఏజెంటు ద్వారా అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం బోలేనాథ్ గుహ వద్ద వరద ముంచుకొచ్చింది. దీనిపై అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన సింహాచలం కుమారుడు నాని మాట్లాడుతూ టీవీల్లో ప్రమాదవార్తను తెలుసుకుని తన తండ్రికి ఫోన్ చేసినట్లు చెప్పారు. తాము కొండ పైభాగంలో ఉన్నామని, ఆర్మీ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా కిందికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారని తెలిపారు. అందరూ క్షేమంగా ఉన్నట్టు తెలిపారని చెప్పారు.
అమర్‌నాథ్ (Amarnath) భక్తుల సమాచారాన్ని తెలుసుకునేందుకు జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir) పరిపాలనా యంత్రాంగం హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది.
NDRF: 011-23438252, 011-23438253
Kashmir Divisional Helpline: 0194-2496240
Shrine Board Helpline: 0194-2313149
PAHALGAM – 9596779039
9797796217
01936243233
01936243018
ANANTHNAG -9596777669
9419051940
01932225870
01932222870