రాష్ట్ర ప్రభుత్వంతో బైజూస్ భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరంగా ఉందని, పేదపిల్లల జీవితాలను ఇది మారుస్తుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం మరో కీలక అడుగువేసింది. అంతర్జాతీయంగా ప్రస్దిద్ధి చెందిన సుప్రసిద్ధ ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ ‘బైజూస్’తో ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా నాణ్యమైన విద్య ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. పేదరికం అన్నది నాణ్యమైన చదువులకు అడ్డం కాకూడదనే సంకల్పంతో వైయస్ జగన్ సర్కార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భారీగావైసీపీ ప్రభుత్వం ప్రచారం కూడా చేసింది. కానీ బైజూస్, డిజిటల్ విద్య పై విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకుందని కాదు. అసలు, ఈ తరహా విద్యా వ్యాపారాన్ని ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తున్నట్టు.? విద్యా దోపిడీకి ఎందుకు ఆస్కారమిస్తున్నట్లు అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, బైజూస్ సంస్థకీ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, ప్రభుత్వ స్కూళ్ళలో బైజూస్ సంస్థ, విద్యార్థుల విద్యాభ్యాసానికి సంబంధించి తమదైన వ్యూహాల్ని అమలు చేస్తుంది. వారిలోని విద్యా నైపుణ్యాల్ని వెలికి తీస్తుంది. ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడేలా, ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థులు, కార్పేట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులతో పోటీ పడేలా రాణించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం.
బైజూస్ అనేది విద్య పేరుతో వ్యాపారం చేసే ఓ సంస్థ. ఆ సంస్థ, ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది.. వ్యాపారం చేయడానికా.? లేదంటే, పేద విద్యార్థుల్ని ఉద్ధరించడానికా.? బైజూస్ ద్వారా విద్యను అందుకోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వేలు ఖర్చు చేయాల్సిందే. వేలు కాదు, లక్షల్లోనూ ఫీజులు చెబుతోంది ఆ సంస్థ. ఇష్టమైనవాళ్ళు అటువైపు చూస్తున్నారు కూడా. మరి, అంతటి భేషైన వ్యాపారం చేస్తూ, పేద విద్యార్థుల్ని ఉద్ధరించేయడానికి వచ్చేసిందంటే నమ్మేదెలా.? ఆన్‌లైన్ విద్యా వ్యాపారం కోసం ఇప్పటికే బైజూస్, ఆన్ అకాడమీ, దేశీ, ఎడెక్స్, కోర్సెరా, ఆలివ్ బోర్డ్…వంటి కార్పొరేట్ సంస్థలు విద్యారంగంలో పెద్ద ఎత్తున వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఎడెటెక్ సంస్థకు 3 కోట్ల వరకు, బైజూస్ కు 3 కోట్లు దాటి విద్యార్థులు వినియోగదారులుగా ఉన్నారనేది సమాచారం. కేంద్ర ప్రభుత్వం అన్ని స్థాయిలలో విద్య నుంచి తప్పుకుని ఆన్‌లైన్ విద్యా మార్కెట్‌ను ప్రోత్సహించే చర్యలను వేగవంతం చేసింది. అదే కోవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు పూర్తిగా ద్వారాలు తెరిచింది.
అదే బైజూస్ బోధన
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విద్య అందిస్తున్న 100 కంపెనీలలో ఇదొకటిగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బైజూస్ కార్పొరేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. బైజూస్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా నాల్గవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఆ కంపెనీ తయారు చేసిన సిలబస్ లేదా కంటెంట్‌ను మాత్రమే ప్రవేశపెడతారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆన్‌లైన్ విధానాన్ని తేవడానికి ప్రయత్నం చేసింది. కరోనా అందుకు కలసి వచ్చింది. ప్రతి విద్యార్థికి ట్యాబ్ ఇస్తారట. తరగతి గదికి ఒక టి.వి పెడతారట. వారి కంటెంట్‌నే పాఠ్యపుస్తకాలుగా అందుబాటులోకి తేనున్నారు. అయితే…అనేక ఛానళ్లతో, విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుని గతంలో పెట్టిన ఆన్‌లైన్ క్లాసులు పేద, బడుగు బలహీన వర్గాలకు ఏ మాత్రం ఉపయోగ పడలేదు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలోని తల్లిదండ్రులు పాఠశాలలు తెరవాలని, భౌతికంగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సౌకర్యాల లేమి ఒకవైపు వెంటాడుతుండగా…కొన్ని ప్రాంతాలలో పాఠశాలలు లేవు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో అక్షరాస్యత రేటు స్వల్పంగా ఉన్నది. పునాది విద్యపై శ్రద్ధ పెట్టలేని ప్రభుత్వం ఇప్పుడు ఆన్‌లైన్, డిజిటల్ విద్యా వ్యవస్థల ప్రవేశానికి అత్యంత ఉత్సాహం చూపుతున్నది.
ఆన్‌లైన్ కోసమే అంతా
పెద్ద మార్కెట్ కోసం కార్పొరేట్ సంస్థలకు లాభాలను చేకూర్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుతుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చింది. దేశంలో ఏ రాష్ట్రంలోను ఎన్.ఇ.పి ని ముందుగా అమలు చేయలేదు. కాని మన రాష్ట్రంలో జీవో 172 ఉత్తర్వులను అమలు చేసి పాఠశాలలను కుదించే ప్రయత్నం చేసింది. విద్య పునర్‌వ్యవస్థీకరణ పేరుతో ప్రపంచబ్యాంకు నుండి అప్పు తెచ్చి సంస్కరణలకు పూనుకుంది. తాజాగా 117 జీవో తెచ్చి పాఠశాలల విలీనం, విద్యా సంస్థలను కేంద్రీకరించడం, ప్రాథమిక పాఠశాలల వ్యవస్థ లేకుండా చేయడం, కేవలం ఆంగ్ల మాధ్యమానికే ప్రాధాన్యతను ఇవ్వడం, ఉపాధ్యాయుల పోస్టులు రేషనలైజేషన్ చేయడం తదితర చర్యలు…భవిష్యత్తులో బైజూస్ వంటి డిజిటల్ విద్యా విధానానికి మార్గం సుగమం చేయడానికే. ఉపాధ్యాయుల అవసరాన్ని, ప్రాధాన్యతను డిజిటల్ విద్య తగ్గించనుంది. నేటి పాలకులకు కూడా అదే కావాలి. కనుక రాష్ట్రంలో సంస్కరణలను వేగవంతం చేస్తున్నారు.
డిజిటల్ విద్య ప్రత్యామ్నాయం కాదు
కార్పొరేట్ సంస్థలు ఎప్పడూ కూడా మార్కెట్లో లాభార్జన విపరీతంగా చేయగల అంశాలనే చొప్పిస్తాయి. ఎందుకంటే దేశంలో నూతన ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చినప్పటి నుండి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా విద్యా రంగంలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్నది అదే. అంతర్జాతీయంగా ఒక అంచనా ప్రకారం ఏటా 13 ట్రిలియన్ డాలర్ల విద్యా వ్యాపారం జరుగుతున్నది. సంప్రదాయక విద్యా వ్యవస్థను దెబ్బ తీస్తే తప్ప ఆన్‌లైన్ విద్య సాధ్యం కాదని ఈ ఒప్పందాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే డిజిటల్, ఆన్‌లైన్, టీవీలు, లాప్‌టాప్‌ల ద్వారా బోధన నాణ్యమైన విద్యకు ప్రత్యామ్నాయం కాదు. ఇవి అదనపు సమాచారం, వేగవంతంగా జరుగుతున్న మార్పుల అధ్యయనానికి ఉపయోగపడే సాధనాలు మాత్రమే. కాని పాలకులు డిజిటల్ విద్యే ప్రత్యామ్నాయం అని చెప్తున్నారు. ప్రభుత్వం అన్ని స్థాయిల్లో విద్య నుంచి తప్పుకుని ఆన్‌లైన్ విద్యా మార్కెట్‌ను ప్రోత్సహించే చర్యలు వేగవంతం చేసింది. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య, విద్యార్థులలో ఒకరికొకరికి మధ్య ఉండవలసిన సజీవ సంబంధాలు లేకుండా చేస్తుంది. ఆన్‌లైన్ తరగతుల్లో పిల్లవాడు వ్యక్తిగా ఎలా అభివృద్ధి చెందుతాడు? విద్యార్థిలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు, భాషా పరిజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం వంటివి ఎలా పెంపొందించబడతాయి. విమర్శనాత్మక దృక్పథం ఏవిధంగా అలవడుతుంది? ఇటువంటివి డిజిటల్ విద్యా బోధనలో కనిపిస్తాయా? విద్యార్థికి-ఉపాధ్యాయునికి మధ్య ప్రత్యక్ష సంబంధాలు లేనపుడు నైతిక విలువలు ఎలా పెంపొందించబడతాయి. చారిత్రాత్మకంగా చూస్తే ఉపాధ్యాయుడికి, తరగతి గదికి సరైన ప్రత్యామ్నాయం ఇంత వరకు లేదు. సంవత్సరాల తరబడి ఒక పరికరం ద్వారానే బోధన అభ్యసనం అనేది సరికాదు.
డిజిటల్ విద్యలో ప్రశ్నించే తత్వం, ప్రశ్నకు జవాబు దొరికే పరిస్థితి ఉండదు. ప్రశ్న నుండే ఘర్షణ ప్రారంభం అవుతుంది. ఘర్షణ నుండే నూతన ఆవిష్కరణలు పుడతాయి. అటువంటి ప్రక్రియకు ఆ విధానంలో అవకాశం లేదు. విద్యార్థి మరబొమ్మలా మారే ప్రమాదం ఉంది. మన రాజ్యాంగం ప్రతి పౌరునికి ప్రశ్నించమని, శాస్త్రీయ ఆలోచన, మానవ వాదాన్ని పెంచుకోవాలని చెప్పింది. అటువంటి రాజ్యాంగ హక్కును కోల్పోతున్నట్లే కదా ? ఆన్‌లైన్ విద్యావిధానం రాజ్యాంగ మూలాల లోపలికి చొరబడుతుంది.
విద్యారంగం నుండి ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకునే దానికి ఇటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నది. 3,4,5 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేయడం, పాఠశాలలను విలీనం చేయడం, 10 మంది విద్యార్థులు గల పాఠశాలల జాబితాను డైరక్టరేట్లకు పంపడం, హైస్కూలులో సమాంతర మీడియంలను రద్దు చేయడం, విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తిని పెంచి భారీ సంఖ్యలో మిగులు ఉపాధ్యాయుల పోస్టులను చూపడం, ఎన్నడూ లేని విధంగా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చడం వంటివి ఈ సంస్కరణలలో భాగమే. కనుక భవిష్యత్తులో టీచర్ల స్థానంలో టి.వి లతో చదువులు చెప్పించే పనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌తో ఒప్పుందం కుదుర్చుకుంది. దీనివలన బడ్జెట్‌లో నిధులు తగ్గించవచ్చు. పి.పి.పి విధానం ముందుకొస్తుంది. పెద్ద ఎత్తున కార్పొరేట్ విద్య పెరగనుంది. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యారంగ రక్షణకై విశాల ఉద్యమాన్ని నిర్మించి, ఐక్యతతో పోరాడాల్సిన సమయమిది
ఆన్ లైన్ విద్యతో అంతా నష్టమే
”ఆన్ లైన్ లో విద్యార్థులకు డిజిటల్ విద్య పేరుతో కార్పొరేట్ పాఠశాలలు, కాలేజీలు దోపిడీ చేస్తున్నాయి. సరైన వ్యాయామం లేక విద్యార్థులు ఇంటికే పరిమితం కావడంతో చిన్నతనం నుంచే అంధత్వ సమస్యలు తలెత్తుతున్నాయి. స్థూలకాయం వలన చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యల ను చాలా మంది చిన్నారులు ఎదుర్కొంటున్నారు…’ ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి వలన అన్నీ రంగాలలో దుర్బలత్వాలు, కఠినమైన సవాళ్లు తలెత్తాయి. అందులో ముఖ్యంగా విద్యావ్యవస్థ తీవ్ర నాటకీయ మార్పులు, ఊహించని విధంగా ప్రీ-స్కూల్ విద్య నుండి విశ్వవిద్యాలయ విద్య వరకు స్తంభించిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పాఠశాల విద్యపై తీవ్ర ప్రభావితం చేసింది, దీని ఫలితంగా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు పాఠశాలలను పూర్తిగా మూసివేశాయి.
ఆంధ్రప్రదేశ్ లో 63,221 పాఠశాలలో ప్రభుత్వం పాఠశాలలు 45,013, ఎయిడెడ్ పాఠశాలలు 2346 మరియు ప్రైవేట్ పాఠశాలలు 15,862 లలో 70-80 లక్షల మంది విద్యార్థులు, విద్యార్థినులు కరోనా కారణంగా వారి విద్యను సజావుగా అభ్యసించలేక 8 వేల గంటల సమయాన్ని వృధాగా కోల్పోయారు. ఈ కరోనా కాలంలో విద్యార్థులకు విధ్యనందించాలని దృక్పధంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ ని అనుసందిస్తూ ” ఆన్ లైన్ విద్యావ్యవస్థ” తో ప్రీకేజీ నుండి పిహెచ్.డి వరకు భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. కానీ మన దేశంలో ఆన్ లైన్ తరగతులు నిర్వహించినా వాటిని పూర్తిగా ఆచరించటానికి సంసిద్దంగా లేకపోవడం గమనార్హం. దానికి కారణం భారత దేశ జనాభా సుమారుగా 140 కోట్లమంది ఉంటే, ఇందులో విద్యను అభ్యసించే వారు 8.4% మంది 0-4 సం౹౹ (ప్లే స్కూల్ లో), 13.4% 5-12 సం౹౹ (ప్రాధమిక పాఠశాల లో), 9.0% 13-17 సం౹౹ (హై స్కూల్ లో), 12.4% 18-24 (కాలేజ్ లో), 16.6% 25-34 సం౹౹ (ఉన్నత విద్యాబ్యాసం), 14.3% 35-44 సం౹౹ (పరిశోధన విద్య) ను అభ్యసిస్తున్నారు.
కరోనా కాలంలో సాంకేతిక తరగతులే కాకుండా 21 రకాల సాంకేతిక బోధనా సాఫ్ట్వేర్ లు రావటం చూస్తుంటే విద్య ను ప్రభుత్వాలే వ్యాపారంగా మారుస్తున్నాయని అర్ధమవుతుంది, ఈ పెనుమార్పులు భవిష్యత్ తరాల విద్యార్థులు ఏవిధంగా నైపుణ్యం సాధిస్తారో సమాధానం లేని ప్రశ్న. యునెస్కో గణాంకాల ఆధారంగా, ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి (3.6 బిలియన్ల మంది) ఇప్పటికీ ఇంటర్నెట్ సదుపాయం లేదు. ఇదే భారత్ లో కనీసం 658 మిలియన్ ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులలో దాదాపు మూడింట ఒకవంతు మంది సాంకేతిక తరగతులు కు చేరలేకపోతున్నారు. చాలా మంది విద్యార్థులకు అవసరమైన మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ లు, ల్యాప్ ట్యాప్ లు, కంప్యూటర్ లు లేవు.
సాంకేతిక విద్య యొక్క లాభ, నష్టాలు చూస్తే భౌతిక విద్య మాత్రమే విద్యార్థిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. కరోనా లాంటి భయానక పరిస్థితులు లేదా లోక్డౌన్ లాంటివి ఎదుర్కొన్నప్పుడు మాత్రమే తప్ప సాంకేతిక విద్య ను మిగిలిన సమయాల్లో ఉపయోగించకూడదు. . ఈ సాంకేతిక విద్యతో విద్యార్థులపై, ప్రభుత్వాలపై ఆర్ధిక భారం పడుతుంది. సాంకేతిక విద్యకు అలవాటు పడితే భవిష్యత్ లో భౌతిక విద్యను విద్యార్థులు అసహ్యించుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆన్లైన్ పద్ధతులను సర్దుబాటు చేయడానికి కొన్నిసార్లు ఉపాధ్యాయులు చాలా కష్టమైన సమయాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతంలో కొన్ని చిన్న పాఠశాలలో ఇప్పటికీ టెలిఫోన్ కనెక్షన్లే లేవు, దీంతో ఆ విద్యార్థులు పరిస్థితి అగమ్యగోచరం. ప్రైవేట్ పాఠశాలలో డిజిటల్ విద్య తో జరుగుతున్న దోపిడీని అరికట్టాలంటే, ప్రభుత్వ పాఠశాలలలో సాంకేతిక విద్య, అభ్యాసాన్ని తప్పనిసరిగా చేస్తూ ప్రైవేటీకరణ విద్యావ్యవస్థకు స్వస్తిపలికి, విద్యను జాతీయకరణ చేసి ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తే సమాజంలోని అన్నీ వర్గాలవారికి విద్య ప్రాధమిక హక్కుతో కూడిన సమానహక్కుగా పరిగణింపబడుతుంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని విద్యార్థుల తల్లి దండ్రులు సంతోష పడాలో… పిల్లలో మేధా సంపత్తి తగ్గిందని బాధపడాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంటోంది.
బైజూస్‌తో ప్రభుత్వ ఒప్పందం రద్దు చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ బోధనకు బైజూస్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దుచేయాలని విద్యార్థి సంఘాలు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని తగ్గించడానికి ఆన్‌లైన్ బోధన ప్రవేశ పెడుతున్నారని ఆరోపించారు. ఈ ఒప్పందం ద్వారా ప్రపంచ బ్యాంకు నుంచి రూ.1,850 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని ధ్వజమెత్తారు. ఈ ఏడాది పది పరీక్షల్లో అత్యధిక మంది ఫెయిల్ కావడానికి గ్రామీణ విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన అందకపోవడమే కారణమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో.117ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.