కాళీ చిత్రంపై కెనడాలో హిందూ సంఘాల ఆగ్రహం
హిందువులు అమితంగా పూజించే కాళికామాతను అవమానించేలా ఉన్న పోస్టర్‌ను ట్విట్టర్ తొలగించింది. ఈ పోస్టర్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో మైక్రోబ్లాగింగ్ సైట్ ఈ నిర్ణయం తీసుకుంది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఫిలిం మేకర్ లీనా మణిమేఖలై పోస్ట్ చేసిన కాళీ మాత పోస్టర్ ట్వీట్‌ను.. ట్విటర్ భారత్‌లో కనపడకుండా చేసింది. స్వలింగ సంపర్కుల జెండా నేపథ్యంలో కాళీ మాత పాత్రలో లీనా ధూమపానం చేస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చిన లీగల్ డిమాండ్ మేరకు ఆ పోస్టును భారత్‌లో కనపడకుండా చేసినట్లుగా ట్విటర్ పేర్కొంది. మరోవైపు.. కెనడాలోని హిందూ సంఘాల నాయకుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ చిత్రానికి సంబంధించి రెచ్చగొట్టే విధంగా ఉన్న అన్ని రకాల సమాచారాన్నీ తొలగించాల్సిందిగా భారత హై కమిషన్ కెనడా అధికారులను కోరింది. దీంతో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనను నిలిపివేసినట్లు కెనాలోని ఆగాఖాన్ మ్యూజియం ప్రకటించింది.
హిందువుల మనోభావాలను కించపరిచినందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెనడాలోని వివిధ జాతులకు, సంస్కృతులకు చెందిన విద్యార్థులతో టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్సిటీ ‘అండర్ ద టెంట్’ ప్రాజెక్టు చేపట్టింది. అందులో భాగంగా 18 మంది తీసిన చిత్రాలను ఆగాఖాన్ మ్యూజియంలో జూలై 2న ప్రదర్శించారు. వాటిలో ఒకటి లీనా మణిమేఖలై తీసిన కాళీ చిత్రం. హిందువుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆ చిత్రాన్ని ఇకపై తాము ప్రదర్శించబోమని ఆగాఖాన్ మ్యూజియం తెలిపింది. ఈ వ్యవహారాన్ని కెనడాలోని భారతీయ హైకమిషన్ కూడా తీవ్రంగా పరిగణించింది. రెచ్చ గొట్టేవిధంగా ఉన్న మెటీరియల్‌ను వెంటనే తొలగించాలని కెనడా అధికారులతోపాటు కార్యక్రమ నిర్వాహకులకు సూచించింది. దీనిపై స్పందించిన అగా ఖాన్ మ్యూజియం.. మతవిశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని హిందూ సమాజం నుంచి ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది.
తమిళనాడు మధురైకి చెందిన లీనా మణిమేగలై.. ‘రిథమ్స్ ఆఫ్ కెనడా’లో భాగంగా ‘కాళీ’ పేరుతో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కెనడాలోని టొరంటో ఉన్న అగాఖాన్ మ్యూజియంలో విడుదల చేశారు. అయితే, ఆ ఫొటోను దేవతా మూర్తిని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. అందులో దేవతామూర్తి సిగరెట్ తాగుతూ ఉండడం, బ్యాక్‌గ్రౌండ్‌లో స్వలింగ సంపర్కుల జెండా వంటివి తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. దేశవ్యాప్తంగానే కాకుండా అటు కెనడాలోని హిందూ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ‘కాళీ మాత మధుమాంసాలు స్వీకరించే దేవతగానే నాకు తెలుసు’ అంటూ వ్యాఖ్యానించిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై భోపాల్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. రామ్‌చంద్ర అనే చాయ్‌వాలా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దాఖలు చేశారు. ఇక, ఆమెను అరెస్టు చేయాలంటూ పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. 10 రోజుల్లోగా పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టును ఆశ్రయిస్తామని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి హెచ్చరించారు. కాళీ మాత భక్తురాలిగా బీజేపీ నేతల గూండాగిరీకి భయపడనని మహువా మొయిత్రా తేల్చిచెప్పారు. ఆమె ట్వీట్‌పై విమర్శలు వస్తుండడంతో ఈ వివాదం నుంచి దూరం జరిగేందుకు టీఎంసీ ప్రయత్నించింది. అవి ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలని, వాటిని పార్టీ సమర్థించట్లేదని తెలిపింది.
సిగరెట్ తాగుతున్న శివుడు..
‘కాళి’ పేరుతో రూపొందిస్తున్న డాక్యుమెంటరీలో కాళి మాత సిగరేట్ తాగుతున్నట్టుగా విడుదలైన పోస్టర్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తమిళనాడులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. అయితే ఇది ఏ డాక్యుమెంటరీనో.. సినిమా పోస్టరో కాదు. తమ స్నేహితుని వివాహం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతు కొందరు యువకులు ఏర్పాటుచేసిన బ్యానర్. అందులో శివుడు సిగరెట్ తాగుతున్నట్లుగా ఫొటోను ముద్రించారు. కన్యాకుమారి జిల్లా ఆరోకియపురానికి చెందిన ప్రతీష్ వివాహం జరుగుతున్నది. ఈ సందర్భంగా అతని స్నేహితులు ప్రతీష్, అతని కాబోయే భార్య ఫొటోలతోపాటు శివుడు సిగరెట్ తాగుతున్నట్లు బ్యానర్లు ముద్రించి ఆరోకియపురం వీధుల్లో ఏర్పాటు చేశారు. వాటిని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వాటిని తొలగించారు. వధూ వరులకు సమన్లు జారీచేశారు. స్టేషన్‌కు పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపించారు.