నేషనల్ హెరాల్డ్ కేసుతో కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెెస్ సిద్ధమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఈడీ ముందు హాజరవుతున్న సమయంలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా.. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోని భాజపా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. విచారణ సంస్థలను ప్రతీకార చర్యలకు వినియోగించుకుంటున్నారని విమర్శించింది. దేశంలోని ముఖ్య ప్రాంతాల్లో ప్రదర్శనలు జరిపి.. మీడియా సమావేశాలు నిర్వహించాలని, రాష్ట్ర రాజధానుల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఏఐసీసీ పేర్కొంది.
దీనికోసం పలువురు నేతలకు బాధ్యతలు అప్పగించింది. గోవాలో మధుయాష్కి గౌడ్, దిల్లీలో సచిన్ పైలట్ సహా పలువురు నాయకులను నిరసనలను చేపట్టాలని ఆదేశించింది. ఎంపీలు, వర్కింగ్ కమిటీ సభ్యులు, ముఖ్య నేతలంతా ఏఐసీసీ నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రాల్లోని ఈడీ యూనిట్ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.
నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 25 ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. రేపు రాహుల్ గాంధీ వెంట పలువురు సీనియర్ లీడర్లు ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీతో పాటు పార్టీ నేత రాహుల్ గాంధీపై కేంద్రం కుట్ర పన్నుతోందని ఇందులో భాగంగానే ఫేక్ కేసులు బనాయిస్తోందని మాణికం ఠాగూర్ ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా విపక్షాల గొంతు నొక్కేందుకు ఈడీ, సీబీఐలను ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే సోనియా, రాహుల్ గాంధీలకు సమన్లు పంపారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేస్తున్నారని, ఈ నిరంకుశ వైఖరిని కాంగ్రెస్ ఏ మాత్రం సహించదని ఠాగూర్ స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా గాంధీకి సైతం సమన్లు జారీ చేసింది.
నేషనల్ హెరాల్డ్ కేసు ఇదే
కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను ఈడీ ప్రశ్నించింది.
హాస్పిటల్లో చేరిన సోనియా గాంధీ
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కరోనా మహమ్మారి సోకడంతో ఇంతకాలం ఇంట్లోనే చికిత్స తీసుకున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సోనియాకు ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అబ్జర్వేషన్ లో ఉంచినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. సోనియా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు చెప్పారు.
సోనియా గాంధీకి జూన్ 2న కరోనా సోకింది. అప్పటి నుంచి ఆమె హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా జూన్ 8న ఈడీ ఎదుట హాజరుకావాలని దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది. అయితే జూన్ 2న ఆమె కరోనా బారిన పడటంతో విచారణకు హాజరుకాలేకపోయింది. దీంతో శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న విచారణకు రావాలని ఆదేశించింది.
నేషనల్ హెరాల్డ్ కేసు తో తప్పుడు ప్రచారం- పీసీసీ
నేషనల్ హెరాల్డ్ కేసు నమోదు ద్వారా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, యువ నేత రాహుల్ గాంధీ పై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిజాయితీగా ఉన్నా మతోన్మాద శక్తులు వారిపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు నమోదు చేసినా వారిని ఏమీ చేయలేరని, వారి నిజాయితీ తెలుస్తుందని స్పష్టం చేశారు. శనివారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
2002 నుంచి 2011 వరకు పదేళ్ళలో 100 వాయిదాలలో చెల్లించేలా రూ.90 కోట్ల ను ఋణము రూపేణా ఇచ్చిందని, అందులో రూ.67కోట్లను నేషనల్ హెరాల్డ్ ఉద్యోగుల జీతాలకు, వాలంటరీ రిటైర్మెంట్ కోసం ఖర్చు చేయడం జరిగిందని గుర్తు చేశారు.కాంగ్రెస్ కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణను శైలజనాథ్ కొట్టి పారేశారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌గాంధీ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు దాఖలు చేయడమే బూటకమని అన్నారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించడం అసంబద్ధమన్నారు.