ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తేనే, పునర్విభజన హామీలు అమలు చేస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తామని జగన్ రెడ్డి చెప్పాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు. అసలు ఆంధ్ర ప్రదేశ్ లో ఎంపీ, ఎమ్మెల్యే లకు అసలు సోయ ఉందా? అని ఆయన ప్రశ్నించారు. నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని పరాయి దేశంగా చూస్తున్నారని ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖాన కాసిన్ని నీళ్లు..మట్టి కొట్టి పోయారని, ఆర్ ఎస్ ఎస్ భావజాలంతో స్వార్ధపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ కి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మద్దతు ఇస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని డిమాండ్ చేశారు. 25 ఎంపీలు ఇస్తే హోదా తీసుకువస్తా అని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. హోదా, విభజన హామీలను నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీలందరినీ కలిసి హోదా విభజన హామీలపై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్రానికి హోదా విభజన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని శైలజానాథ్ స్పష్టం చేశారు.