ప్రతి పైసా ఎస్సీల సంక్షేమానికే ఉపయోగపడాలి
ఎస్సీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెట్టాలి
ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధులను వినియోగంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులకు స్పష్టం చేసారు. సబ్ ప్లాన్ ఖాతా కింద ఖర్చు చేసే ప్రతి రుపాయి కూడా ఎస్సీలకు ఉపయోగపడేలా చూడాలని కోరారు. ఎస్సీల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి ఆలోచనా విధానాన్ని ఆచరణలో పెట్టాలని పేర్కొన్నారు. సచివాలయంలో బుధవారం ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై జరిగిన నోడల్ ఏజెన్సీ తొలి విడత సమావేశంలో నాగార్జున అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసారు. ఎస్సీ సబ్ ప్లాన్ లో కేటాయించిన నిధులను ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఒక ఏడాదిలో ఖర్చు కాని నిధులను మరో సంవత్సరంలో వినియోగించుకునే అవకాశం ఉండదనే విషయాన్ని గుర్తించుకోవాలని కోరారు.
హార్టికల్చర్,ఆర్ అండ్ బి తో సహా కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ సబ్ ప్లాన్ కింద వచ్చిన నిధులు పూర్తిగా ఖర్చు చేయని కారణంగా కోట్లాది రుపాయల నిధులు మురిగిపోవడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ నిధులను పూర్తిగా ఎందుకు వినియోగించుకోలేకపోయారనే విషయంగా సంబంధిత అధికారులను సంజాయిషీ అడుగుతామని చెప్పారు. సబ్ ప్లాన్ నిధులు ఉండి కూడా వాటిని ఖర్చు చేయలేని ప్రభుత్వ శాఖలు ఆ నిధులను ఎస్సీ నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వినియోగించాలని సూచించారు. ఎస్సీల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్న విధంగానే వారి సమగ్రాభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలను సబ్ ప్లాన్ నిధులతో చేపట్టాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖల పనితీరును సమీక్షిస్తూ, సబ్ ప్లాన్ నిధులతో అమలు చేస్తున్నప్పుడు అందులో ఖర్చు చేసే ప్రతి పైసా కూడా ఎస్సీల సంక్షేమానికే ఉపయోగపడేలా చూడాలని కోరారు. సబ్ ప్లాన్ నిధులతో ఏ కార్యక్రమాలను చేపడుతున్నారనే విషయంగా ప్రతిపాదనలు తీసుకొచ్చి ముందుగానే వాటికి నోడల్ ఏజెన్సీలో ఆమోదం పొందాలని కోరారు. నిధులను ఖర్చు చేయని శాఖల నుంచి ఆ నిధులను అవసరమున్న ఇతర శాఖలకు పున: కేటాయింపులు చేయడానికి కూడా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మూడవ త్రైమాసికం తర్వాత దీనికి సంబంధించిన ప్రక్రియను చేపట్టాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశానికి చిన్న నీటిపారుదల శాఖ నుంచి డిఇఇ స్థాయి అధికారి హాజరు కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. నోడల్ ఏజెన్సీ సమావేశాలకు నిర్ణయాధికారం కలిగిన ఉన్నతస్థాయి అధికారులు మాత్రమే హాజరు కావాలని నాగార్జున స్పష్టం చేసారు. మత్స్యకార సహకార సంఘాల్లో ఎస్సీల పేరుతో ఇతరులు లాభపడటం, కొన్ని సంఘాల్లో సభ్యులు మరణించినా నిబంధనలకు విరుద్ధంగా వారి పేర్లతోనే సొసైటీలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, అందుకే ఎస్సీల పేరుతో ఉన్న మత్స్య సహకార సంఘాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైతే వాటిని పునర్ వ్యవస్థీకరించాలని నాగార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పురపాలక, ఆర్అండ్ బీ, విద్యుత్, వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమ, సహకార, పశుసంవర్థక, అటవీ, స్వచ్ఛాంధ్ర తదితర శాఖల పనితీరును నాగార్జున సమీక్షించారు. 2021-22 సంవత్సరంలో చేసిన పనులను సమీక్షించడంతో పాటుగా 2022-23 సంవత్సరంలో పెడుతున్న ప్రతిపాదనలను గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.ఎం. నాయక్, డైరెక్టర్ కే. హర్షవర్ధన్, వివిధ శాఖల ఇఎస్సీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.