తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లతో దేశవ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది. అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైంది. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య ఎటువంటి సంబంధాలు లేవు. తెలుగుదేశం పార్టీ ఎన్డీయేకి దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నప్పటికీ నరేంద్రమోడీ, అమిత్ షా ఇష్టపడటంలేదంటూ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ భారతీయ జనతాపార్టీ తనకు తెలియకుండానే తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భీమవరంలో జరిగిన ప్రధానమంత్రి సభకు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా అతిథిని పంపించాలని కేంద్రం లేఖ రాసింది. మిత్రుడు, జనసేనాని పవన్‌కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్దామంటూ ఇప్పటికే బీజేపీపై ఒత్తిడి తెస్తున్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ను ప్రకటించకపోవడంతో ఇరుపార్టీల మధ్య దూరం పెరిగిందనే వార్తలు వచ్చినప్పటికీ బీజేపీ నేతలు వాటిని కొట్టేశారు. ఎన్నికలకు ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించే సాంప్రదాయం బీజేపీకి లేదని స్పష్టం చేశారు.
తాజాగా ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థినిగా పోటీచేస్తోన్న ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు పలికింది. ఆమె అమరావతి వచ్చిన సందర్భంగా వైసీపీ నేతలతోపాటు టీడీపీ నేతలను కూడా కలిశారు. వైసీపీని కలవడంకన్నా టీడీపీని కలవడమే మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ అంశం వార్తల్లో నిలిచింది. ఒక హోటల్‌లో ముగ్గురు టీడీపీ ఎంపీలు.. 20 మంది ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సమావేశ వేదిక మీద ఇరుపార్టీల నేతలు వేదిక పంచుకున్నారు. టీడీపీతో మొదటినుంచి పొత్తుకు సుముఖంగా లేని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా చంద్రబాబుతో కలిసి వేదిక పంచుకున్నారు. ముర్ముతోపాటు చంద్రబాబు, కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి చివరి క్షణంలో మద్దతు ప్రకటించడం, ఈ సమావేశానికి ముర్ము రావడం వైసీపీ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ మధ్య యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర నాయకత్వం ఈ విషయాన్ని వైసీపీకి తెలియకుండా దాచిందనేది వైసీపీ భావనగా ఉంది. ముందే వెల్లడిస్తే వైసీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయని భావించిన బీజేపీ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతానుభవాలను కూడా దృష్టిలో ఉంచుకొని బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా ఈ విషయాన్ని వైసీపీకి, బయటకు వెల్లడిచేయలేదని భావిస్తున్నారు. ఏపీలో ఇంకా ఎన్నికలకు రెండు సంవత్సరాల సమయం ఉండటం, బీజేపీపై పవన్ ఒత్తిడి తెస్తుండటం, లేదంటే టీడీపీతో కలిసి వెళ్లడానికి సిద్ధపడుతుండటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లాంటి అంశాలన్నీ కేంద్ర నాయకత్వాన్ని ఆలోచనలో పడవేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఓట్లశాతం చాలా తక్కువ. కానీ ముర్ము కలిశారు. స్థానిక బీజేపీ నేతలకు కూడా ఆమె చంద్రబాబును కలవబోతున్నట్లు సమాచారం లేదని తెలుస్తోంది. తమకు తెలియకుండానే ఏదో జరుగుతోందని వీరు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య మైత్రీబంధం మరోసారి చిగురించబోతుందా? లేదా? అనేదానిపై స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పేలాలేదు.!!