పోలవరం పరిహారం పంపిణీలో అక్రమాల కేసులో నిందితుల సంఖ్య 17కు చేరింది. ఇప్పటికే దేవీపట్నం తహసీల్దారు వీర్రాజును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. తాజాగా బుధవారం ఆర్‌ఐ బాపిరాజు, వీఆర్వో సత్తార్…సర్వేయర్ లక్ష్మణ్‌లను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ కలెక్టర్ మురళి, విశ్రాంత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామోజిలను అరెస్టు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం వీరు రంపచోడవరం పోలీసుస్టేషన్‌లో ఉన్నారు. వీరితో పాటు రెవెన్యూ అధికారులు, దళారీలు మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలో నకిలీ డీ-పట్టాలను సృష్టించి పోలవరం ప్రాజెక్టు పునరావాసం కింద రూ.2.25 కోట్ల పరిహారాన్ని అనర్హులకు చెల్లించిన కేసులో అప్పటి పోలవరం భూసేకరణ స్పెషల్ కలెక్టర్‌గా పనిచేసి ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ.మురళిని, అప్పటి ఎడమ కాలువ భూసేకరణ యూనిట్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన పి.రామోజీని పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరినీ బుధవారం రాత్రి రంపచోడవరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో పరిహారం పంపిణీలో అక్రమాలకు పాల్పడిన కేసులో నిందితుల జాబితా 17కు చేరింది. ఈ కేసులో దేవీపట్నం తహశీల్దారు కార్యాలయానికి చెందిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కురసం బాపిరాజు, సర్వేయరు మడకం లక్ష్మణ్, చినరమణయ్యపేట వీఆర్వో షేక్ సత్తార్ సాహెబ్‌లను కూడా పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న దేవీపట్నం తహశీల్దారు కోర్టుకు లొంగిపోగా ఆయనను కస్టడీకి తీసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా పలు విషయాలను సేకరించారు. మొదట్లో 9 మంది నిందితులను చేర్చగా ఇప్పుడు మరో 8 మందిని కలిపి మొత్తం 17 మందిని బాధ్యులుగా గుర్తించారు. పోలీసు దర్యాప్తులో భాగంగా అక్రమ చెల్లింపుల్లో వీరు కీలక పాత్ర పోషించారని నిర్ధారించారు. వారితో పాటు దళారులుగా ఉన్న మరో నలుగురిని కూడా నిందితుల జాబితాలో ఉన్నారు.