జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి రాజధాని విషయంలో దుకుడుగానే వెళ్తున్నారు. మూడు రాజధానుల బిల్లు పెట్టి తన ఆలోచన ఏంటో అందరికీ తెలియపరచారు. కానీ రాజధాని రైతులు మాత్రం సీఎం జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళి పోరాడుతున్నారు. ఈ క్రమంలో అనేక ఆసక్తి కర సంఘటనలు జరుగుతూ వచ్చాయి. కోర్టు కూడా వివిధ సందర్భాల్లో అనేక కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. రాబోయే మంత్రివర్గ సమావేశంలో మళ్ళీ మూడు రాజధానుల బిల్లు గురించి చర్చిస్తారు అనే వార్తలు మధ్య హై కోర్టు కీలక వాఖ్యలు చేసింది.
రాజధాని కేసుల మీద హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది.ఈ కేసు విషయమై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టును కోర్టుకు దాఖలు చేసింది. అయితే రాజధానిలో ఎటువంటి పనులు చేపట్టలేదని, అభివృద్ది పనులు కూడా ఏమీ జరగడం లేదని రైతుల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో SLP వేశారా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు తీర్పులో రైతుల పరిహారానికి సంబంధించి తిరస్కరించడంతో.. దానిపై మాత్రమే SLP వేశామని, హైకోర్టు తీర్పును మాత్రం వ్యతిరేకించలేదని లాయర్ మురళీధర్ తెలిపారు.
ప్రభుత్వం తరుపున SLP వేశారా అని ఏజీని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్మించింది. దానికి ఏజీ తీర్పును సమీక్షించాలని రివ్యూ పిటిషన్ హైకోర్టులో వేయబోతున్నామని తెలిపారు. సుప్రీంకోర్టులో SLP పెండింగ్లో ఉన్న సమయంలో.. హైకోర్టులో విచారణ సబబా అని న్యాయస్థానం ప్రశ్నించింది. మరోవైపు హైకోర్టు తీర్పులో తాము కోరిన అంశాలు తిరస్కరించడంతో వాటిపై మాత్రమే సుప్రీం కోర్టుకు వెళ్లామని రైతుల తరఫు లాయర్ మురళీధర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం సకాలంలో తీర్పును అమలు చేయకపోవడంతో హైకోర్టులోనే కోర్టు ధిక్కార పిటిషన్ కూడా వేశామన్నారు. అయితే ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ ఇచ్చిందని, ఆ నివేదికపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ,రాజధాని కేసులపై తిరిగి విచారణ అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హై కోర్టు ధర్మాసనం పేర్కొంది.